తమిళనాడులోని మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య, అలాగే కేంద్రం-రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలు, వివాదాల పరిష్కారంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ప్రధాన ఉద్దేశం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, పరస్పర సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడమేనని అధికారులు తెలిపారు.
రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు, నీటి వనరులు, మౌలిక వసతులు, భద్రత, పరిపాలన తదితర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ఉమ్మడి అంశాలపై కూడా సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నట్లు టీడీపీ మీడియా సమాచారం. రాష్ట్రానికి రూ.52,474 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కోరనున్నట్లు ప్రసారాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు ఏపీ విభజన చట్టంలోని వివిధ హామీల అమలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లుగా సమాచారం.








