ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్ లింక్స్‌.. సిడ్నీ కాల్పుల కేసులో సంచలనం

ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్ లింక్స్‌.. సిడ్నీ కాల్పుల కేసులో సంచలనం

ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీ నగరం (Sydney City) లోని బాండీ బీచ్‌ (Bondi Beach)లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులకు పాల్పడగా, ఈ ఘటనను ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. హనుక్కా వేడుకలు (Hanukkah Celebrations) జరుగుతున్న వేళ ఈ దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది.

ఈ కాల్పులకు పాల్పడిన వారు తండ్రి–కొడుకులైన 50 ఏళ్ల సాజిద్ అక్రమ్‌ (Sajid Akram – 50 years), 24 ఏళ్ల నవిద్‌గా (Naveed – 24 years) పోలీసులు గుర్తించారు. ఘటన స్థలంలోనే సాజిద్ మృతి చెందగా, తీవ్ర గాయాలైన నవిద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత అతన్ని NSW పోలీసులు (NSW Police) విచారించనున్నారు. ఉగ్ర‌దాడిలో చిన్నారితో సహా మొత్తం 16 మంది మృతి చెందినట్లు సమాచారం.

విచారణలో భాగంగా సాజిద్ అక్రమ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సాజిద్ 1998లో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన వ్యక్తి కాగా, అతని కుమారుడు నవిద్ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. గత 27 సంవత్సరాల్లో సాజిద్ మూడుసార్లు భారత్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. చివరిసారిగా 2022లో హైదరాబాద్‌ (Hyderabad)కు వచ్చినట్లు వెల్లడైంది. అతడు హైదరాబాద్ పాతబస్తీకి చెందినవాడని, అక్కడ అతని ఇద్దరు సోదరులు కుటుంబాలతో నివసిస్తున్నారని సమాచారం.

సాజిద్ భారత పాస్‌పోర్టుతో, అతని కుమారుడు నవిద్ ఆస్ట్రేలియా పాస్‌పోర్టుతో ప్రయాణాలు చేసినట్లు విచారణలో తేలింది. గత నెల నవంబర్ 28న తండ్రి–కొడుకులు ఫిలిప్పీన్స్‌కు వెళ్లి అదే ఫ్లైట్‌లో తిరిగి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే నవిద్ వాహనంలో స్వయంగా తయారు చేసిన ఐఎస్‌ఐఎస్ జెండాలు, ఐఈడీలు లభ్యమవడం సంచలనంగా మారింది. ఆస్ట్రేలియాలో గతంలో జరిగిన పలు పేలుళ్లతో ఈ ఘటనకు సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment