గిల్ రాకతో ఒత్తిడి పెరిగింది: సూర్యకుమార్ యాదవ్

గిల్ రాకతో ఒత్తిడి పెరిగింది: సూర్యకుమార్ యాదవ్

Summarize with AI

ప్రస్తుతం భారత జట్టు (Indian Team) రెండు ఫార్మాట్లలో ఇద్దరు కెప్టెన్ల విధానాన్ని కొనసాగిస్తోంది. టెస్టులు, వన్డేలకు శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) నాయకత్వం వహిస్తుండగా, టీ20 ఫార్మాట్‌కు మాత్రం సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథిగా వ్యవహరిస్తున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో సూర్యకు గిల్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో అన్ని ఫార్మాట్లకు గిల్ ఒకే కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ పరిణామంపై స్పందించిన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్‌ గిల్ రాకతో తనపై ఒత్తిడి పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. “ఈ విషయంలో నేను అబద్ధం చెప్పను, ప్రతి ఒక్కరికీ ఆ భయం ఉండటం సహజం” అని ఆయన తెలిపారు. అయితే, ఆ ఒత్తిడి గురించి ఎక్కువగా ఆలోచించకుండా, దానిని ఒక ప్రేరణగా తీసుకుని తన ఆటపై దృష్టి పెడతానని, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని సూర్యకుమార్ వెల్లడించాడు.

ఇక, భవిష్యత్తులో గిల్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించినా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని సూర్య స్పష్టం చేశాడు. గిల్ టీమ్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. స్టేడియంలోనే కాదు, బయట కూడా తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, గిల్ ఎలాంటి వ్యక్తి అనేది తనకు తెలుసని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు, గతంలో క్రీజ్‌లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్య, ఇటీవల ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో, కెప్టెన్‌గా కొనసాగాలంటే, ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ కచ్చితంగా తన సత్తా చాటాల్సిందేనని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment