వీవీప్యాట్ స్లిప్పులపై టైమ్ స్టాంప్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్?

వీవీప్యాట్ స్లిప్పులపై టైమ్ స్టాంప్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..? ఈసీఐకే తుది నిర్ణయం!

ఓటింగ్ (Voting) ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతో దాఖలైన కీలక ప్రజాహిత వ్యాజ్యంపై(Public Interest Litigation – PIL) సుప్రీంకోర్టు (Supreme Court of India) బుధవారం విచారణ జరిపింది. వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులపై(Slips) ఓటు నమోదైన ఖచ్చితమైన సమయాన్ని ముద్రించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. ఈ అంశం పూర్తిగా సాంకేతికపరమైనదని పేర్కొంది. చీఫ్ జస్టిస్‌తో పాటు జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) ఉన్న బెంచ్.. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది భారత ఎన్నికల సంఘమేనని స్పష్టం చేసింది. వ్యాపారవేత్త నల్లా సురేష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ (Devadatt Kamat) కోర్టులో వాదనలు వినిపించారు.

ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఫామ్ 17A, ఫామ్ 17C, అలాగే ఈవీఎంల(EVMs) కంట్రోల్ యూనిట్లలో ఓట్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. వీవీప్యాట్ స్లిప్పులపై ఓటు వేసిన సమయం నమోదు కావడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పోలింగ్ చివరి గంటల్లో ఓటింగ్ శాతం ఒక్కసారిగా పెరిగిన సందర్భాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయని, టైమ్ స్టాంప్ ఉంటే ఫిజికల్ ఆడిట్ మరింత సులభమవుతుందని వివరించారు. దీంతో ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, పారదర్శకత మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే టైమ్ స్టాంప్ ముద్రించడం (Time Stamp Printing) వల్ల ఓటరు వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. ఓటు రహస్యంగానే ఉంటుందని, కేవలం సమయం మాత్రమే నమోదవుతుందని తెలిపారు. అదనంగా స్ట్రాంగ్ రూమ్ యాక్సెస్ లాగ్‌లు, సీసీటీవీ రికార్డింగ్‌లు, వీవీప్యాట్ స్లిప్పుల భద్రతా విధానాలను మరింత కట్టుదిట్టం చేయాలని కూడా కోరారు. అయితే ఈ అంశంలో సాంకేతిక సాధ్యసాధ్యాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని భావించిన సుప్రీంకోర్టు.. ఎలాంటి ప్రత్యక్ష ఆదేశాలు ఇవ్వకుండా పిటిషన్‌ను ముగించింది. అదే సమయంలో ఈ పిటిషన్‌ను వినతిపత్రంగా పరిగణించి పరిశీలించాలని భారత ఎన్నికల కమిషన్ కు పంపించాలని కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment