ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) సంచలనం సృష్టించిన కర్నూలు విద్యార్థిని సుగాలి ప్రీతి కేసు (Sugali Preethi Case) మరోసారి తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ గత తొమ్మిదేళ్లుగా పోరాడుతున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు సుగాలి పార్వతి(Sugali Parvathi), రాజు నాయక్‌లు (Raju Naik) మంగళవారం తాడేపల్లిలో వైసీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని (Y. S. Jagan Mohan Reddy) కలిశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, కేసును పక్కనపెట్టేసిన తీరును వివరించి వారు కన్నీరు మున్నీరయ్యారు.
వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం సుగాలి ప్రీతి తల్లి పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే తమ బిడ్డ కేసును వాడుకున్నారని ఆమె ఆరోపించారు.
“2020 నుంచి 2024 వరకు జరిగిన ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ మా ప్రీతి గురించే మాట్లాడారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం ప్రీతి విచారణపైనే పెడతానని మాకు నమ్మబలికారు. ఆడపిల్లలకు అండగా ఉంటారనుకున్నాం.. కానీ అధికారంలోకి వచ్చాక కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారు. జనసేన (Jana Sena) ఆఫీస్ చుట్టూ తిరిగినా పవన్ బిజీగా ఉన్నారని పంపించేశారు. చివరకు గొడవ చేస్తే ఒకసారి కలిశారు కానీ, ఈ కేసులో ఇక నేనేమీ చేయలేనని మొహం చాటేశారు.”
కేసులోని నిందితులంతా తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందినవారేనని, ఆ వివరాలన్నింటినీ ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్‌కు చూపించామని బాధితులు వెల్లడించారు. “సాక్ష్యాలు తారుమారు అయ్యాయని, ఇక ఈ కేసులో విచారించాల్సిందేమీ లేదని పవన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. పవన్ కుటుంబ సభ్యులను తిట్టిన వారిని గంటల్లో అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. మా బిడ్డను కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన వారిని మాత్రం వదిలేసింది. మమ్మల్ని బాధితులుగా కాకుండా ముద్దాయిలుగా చూస్తున్నారు. ఆడపిల్లలను అడ్డం పెట్టుకుని ఇంత దిగజారుడు రాజకీయం చేయాలా? కేవలం ఎన్నికల కోసమే మా బిడ్డ కేసును వాడుకున్నామని పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి” అని పార్వతి డిమాండ్ చేశారు.
బాధిత తల్లిదండ్రుల గోడును విన్న వైఎస్ జగన్ వారికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒక నిరుపేద, బాధిత కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడం దారుణమన్నారు. సుగాలి ప్రీతి కేసులో దోషులకు శిక్ష పడే వరకు, నిలిచిపోయిన సీబీఐ విచారణను పునరుద్ధరించేలా ప్రభుత్వ రికార్డులను బయటపెట్టేందుకు వైఎస్సార్సీపీ తరపున అన్ని రకాల న్యాయ సహాయం (Legal Support) అందిస్తామని, అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ వారికి గట్టి భరోసా ఇచ్చారు.








