తమిళనాడులో(Tamil Nadu) 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Elections 2026 Results) ఊహించని రీతిలో వెలువడ్డాయి. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ద్రావిడ దిగ్గజాలకు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా డీఎంకే (DMK) ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో తమిళనాడు పరిణామాలను ఏపీ రాజకీయాలతో పోలుస్తూ రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు. డీఎంకే పార్టీ ఓటమికి సన్ స్ట్రోక్(Son’s Stroke) కారణమంటూ చర్చించుకుంటున్నారు.
తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ (M. K. Stalin) నాయకత్వంలోని డీఎంకే(DMK) ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో టీవీకే (TVK) అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయడం, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన అతి జోక్యం పెరిగిందన్న విమర్శలు డీఎంకే పాలిట శాపంగా మారాయి. ప్రభుత్వంలో ఉదయనిధి వర్గం పెత్తనం, వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలు సామాన్య ప్రజలను పార్టీకి దూరం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
చంద్రబాబుకు ‘సన్ స్ట్రోక్’ తప్పదా?
తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తీరు డీఎంకేను ముంచేసినట్టే, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) నారా లోకేష్(Nara Lokesh) తీరు కూడా తెలుగుదేశం పార్టీకి(Telugu Desam Party) ముప్పుగా పరిణమిస్తుందా? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
ఇటీవలే లోకేష్‌ను టీడీపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇది పార్టీలో తదుపరి వారసుడిగా ఆయనకు పట్టాభిషేకం చేయడమేనని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా వ్యవహారాలపై దృష్టి పెడితే, లోకేష్ పార్టీని, ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేక “కోటరీ”ని ఏర్పాటు చేసుకున్నారని, దీనివల్ల పార్టీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నేతలు ప్రాధాన్యత కోల్పోతున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. తన అనుచర గణానికి కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా లోకేష్ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సీనియర్లలో రగిలిపోతున్న అసహనానికి కారణమని సమాచారం.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లోకేష్ ఐటీ, విద్య వంటి కీలక శాఖలనే కాకుండా, అన్ని శాఖల పైనా పర్యవేక్షణ చేస్తున్నారని, ఆయన ఒక డి ఫాక్టో సీఎం(అధికారాన్ని చలాయించే వ్యక్తి)గా వ్యవహరిస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
తమిళనాడు ఫలితాలు ఒక పాఠం. ఎంత పెద్ద పార్టీకైనా, ఎంతటి మీడియా అండ ఉన్నా.. ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఫలితం ఎలా ఉంటుందో స్టాలిన్ ఓటమి నిరూపించింది. తనయుడి రాజకీయ ఎదుగుదల కోసం పార్టీని, ప్రభుత్వాన్ని తాకట్టు పెడితే అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు వారసత్వ రాజకీయాల కంటే పనితీరుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. లోకేష్ చుట్టూ ఉన్న అవినీతి ఆరోపణలను కంట్రోల్ చేయకపోతే, ఏపీలో కూడా ‘తమిళనాడు తరహా’ ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
స్టాలిన్ తనయుడిని ప్రమోట్ చేసినట్టుగానే, చంద్రబాబు కూడా లోకేష్‌కు పగ్గాలు అప్పగిస్తున్నారు. అయితే, లోకేష్‌ను కంట్రోల్లో ఉంచి పార్టీని ముందుకు నడిపిస్తారా? లేక డీఎంకే లాగే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారా? అన్నది వేచి చూడాలి.








