శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం.. చరిత్రలో తొలిసారి

శ్రీశైల మహాక్షేత్రంలో అపచారం.. చరిత్రలో తొలిసారి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని సుప్ర‌సిద్ధ‌ శ్రీశైల మహాక్షేత్రంలో మ‌హాప‌చారం జ‌రిగింది. శ్రీశైలం మల్లన్న ఆలయ చరిత్రలో తొలిసారిగా స్వామి–అమ్మవార్ల గ్రామోత్సవం ర‌ద్దు చేయ‌డం తీవ్ర వివాదంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహించాల్సిన స్వామి, అమ్మవార్ల వాహనసేవతో పాటు గ్రామోత్సవాన్ని దేవస్థాన అధికారులు రద్దు చేయడం భక్తుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

క్యూలైన్లలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో, ఉత్సవమూర్తులను రాజగోపురం వెలుపల ఊరేగించలేమని దేవస్థానం అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పురవీధుల్లో జరగాల్సిన గ్రామోత్సవాన్ని ఆలయ ప్రాంగణానికే పరిమితం చేశారు. అయితే, సంప్రదాయ ప్రకారం గ్రామోత్సవం అనేది ఆలయం వెలుపల పురవీధుల్లో నిర్వహించాల్సిందేనని భక్తులు గుర్తు చేస్తున్నారు.

గ్రామోత్సవం జరగకపోవడాన్ని భక్తులు అపచారంగా భావిస్తున్నారు. “శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఈ విధంగా పక్కన పెట్టడం దేవస్థాన అధికారుల వైఫల్యమే” అంటూ మండిపడుతున్నారు. భక్తులకు దర్శనాలు సక్రమంగా కల్పించలేకపోవడం, ఉత్సవాల నిర్వహణలో పూర్తిగా చేతులెత్తేయడం ఆలయ ఈవో శ్రీనివాసరావు వైఫల్యంగా భక్తులు ఆరోపిస్తున్నారు.

భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం, సంప్రదాయ ఉత్సవాలను సక్రమంగా నిర్వహించలేకపోవడం దేవస్థానం పాలనపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. పవిత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శివ స్వాములపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం వంటి ఘటనలు చోటుచేసుకోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో జరిగిన ఈ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment