సతీష్ కుమార్ మృతి కేసు.. సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేసిన పోలీసులు

సతీష్ కుమార్ మృతి కేసు.. సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేసిన పోలీసులు

తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటన రాజకీయరంగంలో ఉద్రిక్తతను రేపుతోంది. ప్రతిపక్ష వైసీపీ సీబీఐ దర్యాప్తు కోరుతుండగా, అధికారపక్షం మాత్రం ఇది హత్యేనని ఆరోపణలు చేస్తూ వైసీపీని నిందిస్తోంది. ఈ కేసు అసలు నిజాలను వెలికితీయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

అనుమానాస్పద మృతిపై నిజానిజాలు తెలుసుకునేందుకు అనంతపురం జిల్లా పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ చేపట్టారు. చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌ నుండి ఏవైనా పరిస్థితుల్లో వ్యక్తి బయటకు పడిపోయే అవకాశం ఉందా అన్నది తెలుసుకునేందుకు ఒక బొమ్మను రైలు నుండి విసిరి పలు పరీక్షలు నిర్వహించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని కోమలి గ్రామం వద్దే సీన్ రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ చేశారు. సతీష్ మృతి ఆత్మహత్యా? హత్యా? అనే అంశంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అంత‌కు ముందు ఘటనాస్థలిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ పరిశీలించారు. కోమలి వద్ద రైల్వే పట్టాల మృత‌దేహం ల‌భించిన ప్ర‌దేశాన్ని ప‌రిశీలించి, స్థానిక పోలీసుల నుండి కేసు పురోగతిపై వివరాలు సేకరించారు. గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తుండగా, కోమలి వద్ద సీఐ సతీష్ కుమార్ శవమై కనిపించడం కేసుపై మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది.

సతీష్ కుమార్ మృతి కేసును మొదట గుత్తి పోలీసులు నమోదు చేయగా, తరువాత దాన్ని తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అనంతపురం ఎస్పీ జగదీష్, కేసు వివరాలను సీఐడీ చీఫ్‌కు తెలియజేశారు. ఈ కేసు ఏ మేరకు మలుపులు తిరుగుతుందో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment