5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల కేంద్రంగా ఏపీ.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల కేంద్రంగా ఏపీ.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ‘ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్ట్ సెంటర్’ (AMCA ప్రాజెక్ట్) కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.15,803 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు దేశ రక్షణ రంగంలోనే ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశ రక్షణ, ఏపీ ప్రగతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

“పుట్టపర్తిలో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌కు శంకుస్థాపన చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ రోజుతో సరికొత్త నవశకం ప్రారంభమైంది. ఒకప్పుడు యుద్ధ విమానాల తయారీ కోసం భారత్ విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టిన ఈ ప్రాజెక్టు దేశ స్వయంసమృద్ధికి అత్యంత కీలకంగా మారబోతోంది” అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

డీఆర్‌డీవో (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) నేతృత్వంలో భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక ఐదో తరం (5th Generation) స్టెల్త్ యుద్ధ విమానాలను (AMCA) ఇక్కడే తయారు చేయబోతున్నట్లు రక్షణ మంత్రి వెల్లడించారు. “ఈ రకమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోనే కేవలం కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. భవిష్యత్తులో శత్రువులను నాశనం చేయగల శక్తిమంతమైన యుద్ధ విమానాలను తయారు చేసే ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి ప్రపంచ పటంలో నిలవబోతోంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక ‘గేమ్ చేంజర్’ అని రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. కేవలం రక్షణ రంగంలోనే కాకుండా, రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలోనూ డ్రోన్లు అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నాయన్నారు. ఈ క్రమంలో ఏపీలో నిర్మిస్తున్న ‘డ్రోన్ సిటీ’ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీకి కర్నూలు జిల్లా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హబ్‌గా మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment