ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ సహా 15 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 18వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లో వర్షాలు పడవచ్చని వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.








