ఒకప్పుడు టాలీవుడ్‌లో అక్కాచెల్లెళ్లుగా హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న రాధ, అంబిక ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన గదిలో ఖాళీ చెక్కులు చోరీ చేసి, వాటి ద్వారా దాదాపు రూ.50 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించారని నటి రాధ.. తన అక్క అంబిక, సోదరుడు మల్లిఖార్జున్‌పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు నేపథ్యంలో అంబిక స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అసలు మోసపోయింది తానేనని ఆమె పేర్కొన్నారు. రాధ ఎవరో ఇచ్చిన తప్పుడు సలహాతోనే పోలీసులను ఆశ్రయించి ఉంటారని ఆమె అన్నారు.
‘నిజానికి మోసపోయింది నేనే. నేనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. రాధకు ఎవరో తప్పుడు సలహా ఇచ్చారు. ఆమె ఎవరి ప్రభావంతో ఇలా చేసిందో నాకు తెలియదు. అయితే రాధను చూస్తే జాలేస్తోంది’ అని అంబిక వ్యాఖ్యానించారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బులో సగం తమ తల్లికి ఇచ్చామని చెప్పారు. అలాగే ఏఆర్ఎస్ అనేది అంబికా దేవర్ ఫిలిమ్స్ కుటుంబం కొనుగోలు చేసిన తొలి ఆస్తి అని తెలిపారు. కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో తాను అండగా నిలిచానని, ఈ వ్యవహారం వెనుక చాలా చరిత్ర ఉందని వివరించారు. అయితే వివాదానికి సంబంధించి కొన్ని చట్టపరమైన అంశాలు ఉన్నందున అన్ని విషయాలను బహిరంగంగా వెల్లడించలేనని స్పష్టం చేశారు.
కుటుంబం కోసం ఒకప్పుడు అందరం కలిసి ఆలోచించేవాళ్లమని, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఈ వివాదం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి విషయం డబ్బు చుట్టూనే తిరుగుతోందని, సినిమా పరిశ్రమలోనూ డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం పెరిగిపోయిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. రాధ చేసిన ఫిర్యాదు, అంబిక ఇచ్చిన వివరణతో ఈ కుటుంబ వివాదం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.








