భారత్-పాక్ (India-Pakistan) మధ్య పరిస్థితులు తీవ్రంగా ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ షాకిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో వాఘా-అటారీ (Wagah-Attari) సరిహద్దు మూసివేత, పాకిస్థాన్ (Pakistan) కు చెందిన దౌత్యవేత్తలను వెనక్కి పంపించడం, పాక్ పౌరులకు సార్క్ (SAARC) వీసాలను రద్దు చేయడం, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వంటి నిర్ణయాలున్నాయి.
గగనతలాల తాత్కాలిక మూసివేత
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ తన గగనతలాన్ని భారత విమానయాన సంస్థలకు మూసివేసింది. ప్రతిస్పందనగా భారత్ సైతం చర్యలు తీసుకుంది. ఈ గగనతలాల తాత్కాలిక మూసివేతతో అంతర్జాతీయ విమానాల రవాణాపై ప్రభావం పడింది. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు భారత ఆర్మీ (Army), ఎయిర్ ఫోర్స్ (Air Force), నేవీ (Navy) సంయుక్తంగా మెరుపుదాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
ఖతార్ ఎయిర్‌వేస్ నిర్ణయం
ఇలాంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతార్ ఎయిర్‌వేస్ (Qatar Airways) పాక్ గగనతలాన్ని వదిలివేయాలని నిర్ణయించింది. పాక్ గగనతలం మూసివేయబడిన నేపథ్యంలో తాత్కాలికంగా పాకిస్తాన్‌కు విమాన సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని ఖతార్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నామని సంస్థ తెలిపింది.