దుబాయ్ (Dubai) నుంచి టెల్ అవీవ్‌కు(Tel Aviv) వెళ్తున్న ఫ్లై దుబాయ్ (Flydubai) విమానం FZ1073లో సెప్టెంబర్ 30న తీవ్ర ఘటన చోటుచేసుకుంది. విమానంలో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా.. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో భారతీయ కెప్టెన్ (Indian Captain) స్మిత్ మచ్చార్‌పై (Smith Machar) ఆయన కో-పైలట్ (Co-pilot) దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో స్మిత్ తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో విమానం సుమారు 33 వేల అడుగుల నుంచి 17 వేల అడుగుల వరకు వేగంగా దిగిపోయింది. గాయాలతో ఉన్నప్పటికీ స్మిత్ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో కేబిన్ సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరుకుని దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని (Saudi Arabia) తబుక్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ ఘటనపై యూఏఈ (UAE) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కో-పైలట్ దాడికి పాల్పడటానికి గల కారణం ఏమిటి, ఘటన వెనుక ఉద్దేశం ఏంటి, విమాన భద్రతా విధానాల్లో ఏమైనా లోపాలు చోటుచేసుకున్నాయా వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దాడిని కొందరు అధికారులు విమానాన్ని కూల్చే ప్రయత్నంగా అభివర్ణించినప్పటికీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు దాని ఉద్దేశాన్ని తుది నిర్ణయంగా చెప్పలేమని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనతో కాక్‌పిట్ భద్రత(Cockpit Security), పైలట్లకు సంబంధించిన స్క్రీనింగ్ విధానాలు(Pilot Screening Procedures), విమాన సిబ్బంది నుంచి తలెత్తే ముప్పులను ఎదుర్కొనే భద్రతా ప్రోటోకాల్స్‌పై అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో(Benjamin Netanyahu) పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా స్మిత్ చర్యలను ప్రశంసించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 2న వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన సమయంలో తనను తాను ధైర్యంగా ఉంచుకునేందుకు హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) చదువుతున్నానని స్మిత్ తెలిపారు. తీవ్ర గాయాలతో నేలపై ఉన్నప్పటికీ చివరి ప్రయత్నంగా కాక్‌పిట్ తలుపు తెరవాలని నిర్ణయించుకున్నానని మోదీకి వివరించారు. స్మిత్ ధైర్యం, సమయస్ఫూర్తి, ప్రశాంతతను మోదీ అభినందించారు. అనంతరం “కెప్టెన్ స్మిత్‌తో జరిగిన ఈ సంభాషణ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గర్వం, భావోద్వేగాలతో నిండిపోయింది” అని మోదీ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం స్మిత్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు అధికారులు తెలిపారు.









