దేశవ్యాప్తంగా వాహనదారులకు ఇంధన ధరలు మరోసారి చుక్కలు చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగవ సారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ భారీ నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే చమురు కంపెనీలు ధరల మోతను ప్రారంభించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తాజాగా లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 మేర ధరలు పెరిగాయి. ఈ పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.117.19, డీజిల్ ₹104.88 కాగా, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.115.58, డీజిల్ రూ.103.74 ఉంది.
దేశంలోనే టాప్‌లో ఆంధ్రప్రదేశ్
ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు నమోదు కావడం గమనార్హం. స్థానిక పన్నులు, అదనపు వ్యాట్ (VAT), రోడ్డు డెవలప్‌మెంట్ సెస్ వంటి కారణాల వల్ల ఏపీలో ఇంధన ధరలు దేశంలోనే అత్యంత భారంగా మారాయి. ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర సరుకుల ధరలు కూడా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.
దేశంలో అత్యధిక ధరలు ఉన్న రాష్ట్రాలు (లీటరుకు):
ఆంధ్రప్రదేశ్: రూ.117.88
తెలంగాణ: రూ.115.69
కేరళ: రూ.115.49
దేశంలో అతి తక్కువ ధరలు ఉన్న ప్రాంతాలు:
అరుణాచల్ ప్రదేశ్: రూ.97.70
అండమాన్ & నికోబార్: రూ.88.66
ప్రతిపక్షాల విమర్శలు.. వాహనదారుల ఆగ్రహం
గతంలో ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను తగ్గిస్తామని, కర్ణాటక, తెలంగాణ కంటే ఏపీలోనే రేట్లు ఎక్కువగా ఉన్నాయంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్‌లతో విమర్శలు చేసిన విషయాన్ని వాహనదారులు గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నప్పటికీ, ధరలను నియంత్రించడంలో, పన్నులు తగ్గించడంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూడా రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు పడుతుంటే కనీసం స్పందించకపోవడంపై సర్వత్రా మండిపడుతున్నారు.









కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్రం అస్తిపంజరం.. – బొత్స ధ్వజం!