Peddi Movie Review: ‘పెద్ది’ ప్రయాణం ఎలా ఉందంటే?

Peddi Movie Review: ‘పెద్ది’ ప్రయాణం ఎలా ఉందంటే?

సినిమా : పెద్ది
నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు
దర్శకత్వం: బుచ్చిబాబు సానా
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రత్నవేలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో అనౌన్స్ చేసినప్పటి నుంచే ‘పెద్ది’ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు వంటి భారీ తారాగణం తోడవడంతో హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం.. జూన్ 3 సాయంత్రమే ప్రత్యేక ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ చేరిందా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే?
విజయనగరం పట్టణానికి సమీపంలోని ఓ వెనుకబడిన కొండ కింద పల్లెలో నివసించే ఆదివాసి యువకుడు పెద్ది (రామ్ చరణ్). ఆ గ్రామానికి ఎలాంటి గుర్తింపు ఉండదు. అయితే, ఆ ఊరి మీదుగా వెళ్లే రైలు తమ గ్రామంలో ఆగేలా ఒక స్టేషన్ సాధించి, ఎలాగైనా ఊరికి గుర్తింపు తీసుకురావాలని అదే గ్రామానికి చెందిన అప్పలసూరి (జగపతిబాబు) తీవ్రంగా శ్రమిస్తుంటాడు.

మరోపక్క, పెద్ది డబ్బు కోసం స్థానిక మ్యాచ్‌లలో క్రికెట్ ఆడుతుంటాడు. ఈ క్రమంలో ఊరి ఎమ్మెల్యే కూతురు అచ్చి అమ్మ (జాన్వీ కపూర్) కారణంగా, తాను ఆడే టీమ్ వారితోనే పెద్దికి గొడవ జరుగుతుంది. అక్కడ జరిగిన అవమానంతో తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారికి బుద్ధి చెప్పేందుకు, ఊరిలోనే ఎంతోమందికి కుస్తీ నేర్పించే గౌరీ నాయుడు (శివ రాజ్‌కుమార్) దగ్గర చేరి కుస్తీ నేర్చుకుంటాడు. కుస్తీలో నేషనల్స్ సాధించి ఊరి పేరు నిలబెట్టాలనుకునే తరుణంలో, పెద్ది జీవితాన్ని ఓ ఊహించని సంఘటన తారుమారు చేస్తుంది. ఆ తర్వాత పెద్ది ఢిల్లీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అతని జీవితాన్ని మార్చిన ఆ సంఘటన ఏంటి? చివరికి తన ఊరి కోసం పెద్ది చేసిన పోరాటం ఫలించిందా? రైలు స్టేషన్ వచ్చిందా లేదా? అనేదే మిగతా కథ.

రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా అంటే పక్కా కమర్షియల్ ఎలివేషన్లు, మాస్ మసాలా ఫైట్లు ఆశిస్తారు. కానీ, దర్శకుడు బుచ్చిబాబు కమర్షియల్ హంగులకు దూరంగా ఒక ప్యూర్ స్పోర్ట్స్ డ్రామాను, ఎమోషనల్ కథను నమ్ముకుని ఈ సినిమా చేశాడు. ఒక స్టార్ హీరో ఇలాంటి భిన్నమైన కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. అందులోనే చరణ్ సగం సక్సెస్ అయ్యాడు.

సినిమా ఫస్టాఫ్‌ క్రీడా స్ఫూర్తిని వెతుక్కుంటూ వచ్చే బోమన్ ఇరానీ పాత్రతో, విజయనగరం నేపథ్యంలో ఆసక్తికరంగా మొదలవుతుంది. పెద్ది క్రికెట్ ఆడే సీన్లు, ఆ తర్వాత కుస్తీ వైపు మళ్లే ట్రాక్ బాగున్నప్పటికీ.. ఫ‌స్ట్ హాఫ్‌ కొన్ని చోట్ల కథనం నెమ్మదించి లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే, ప్రీ-ఇంటర్వెల్ నుండి సినిమా ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది.

సెకండాఫ్‌ను దర్శకుడు చాలా పగడ్బందీగా స్క్రీన్‌ప్లేతో నడిపించాడు. ఢిల్లీలో జరిగే కుస్తీ ఎపిసోడ్స్ థ్రిల్ కలిగిస్తాయి. ఆ తర్వాత పెద్ది మూడో ఆట వైపు వెళ్లాల్సి వచ్చే పరిస్థితులను ఎమోషనల్ గా డిజైన్ చేసిన తీరు హృదయాలను హత్తుకుంటుంది. ఇది కేవలం ఒక క్రీడాకారుడి ప్రయాణం మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోసం ఒక గ్రామం చేసిన పోరాటంగా నిలుస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్
రామ్ చరణ్ కెరీర్‌ను ‘రంగస్థలం’కు ముందు, ఆ తర్వాత అని ఎలా మాట్లాడుకుంటారో.. ఇకపై ‘పెద్ది’కి ముందు, ‘పెద్ది’కి తర్వాత అని మాట్లాడుకుంటారు. పెద్ది పాత్రలో ఆయన నటనతో ఆక‌ట్టుకుంటాడు. రామ్ చరణ్ తర్వాత ఈ సినిమాలో అంతటి బలమైన పాత్ర జగపతిబాబుదే. అప్పలసూరి పాత్రలో ఆయన జీవించేశారు. ఒకప్పటి ఫ్యామిలీ హీరోనా ఈ రకమైన నటన చేస్తోంది అనేంతలా ఆకట్టుకున్నారు. జాన్వీ కపూర్ పాత్ర పరిధి తక్కువే, గ్లామర్‌కే పరిమితమైంది. శివ రాజ్‌కుమార్ గంభీరమైన పాత్రలో మెప్పించగా, దివ్యేందు శర్మ ఉన్నంతలో మంచి నటన కనబరిచాడు.

టెక్నికల్ వండర్
ఈ సినిమాకు దర్శకుడు బుచ్చిబాబు ఆలోచనే అతిపెద్ద బలం. కథను ఎంత నిజాయితీగా రాసుకున్నాడో, స్క్రీన్‌పై అంతే అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌గా ఉంది. పీరియాడిక్ సెటప్‌ను ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా రీ-క్రియేట్ చేసింది. ఎడిటింగ్ విషయంలో ఫస్టాఫ్‌లో కొద్దిగా కత్తెర వేసి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్
రామ్ చరణ్, జగపతిబాబు నటన ఈ సినిమాకు ప్ల‌స్‌గా నిలిచాయి. సెకండాఫ్ స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ సీన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రత్నవేలు సినిమాటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్
స్లోగా సాగే ఫస్టాఫ్, రెగ్యులర్ మాస్ మసాలా అంశాలు ఆశించే వారికి నచ్చకపోవచ్చు

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఒక గొప్ప క్రీడా స్ఫూర్తి కథతో వచ్చిన చిత్రమిది. కమర్షియల్ మాస్ ఎలివేషన్లు కోరుకునే వారికి కొంత నిరాశ కలిగించినా.. ఒక మంచి సినిమాను, అద్భుతమైన ఎమోషనల్ డ్రామాను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పెద్ది’ ఒక మెమరబుల్ రైడ్‌గా నిలిచిపోతాడు.

రేటింగ్: 2.75/5

Join WhatsApp

Join Now

Leave a Comment