‘పెద్ది’ కలెక్షన్ల‌కు పైరసీ దెబ్బ.. ‘హై-క్వాలిటీ’ లీకేజీ?

'పెద్ది' కలెక్షన్ల‌కు పైరసీ దెబ్బ.. 'హై-క్వాలిటీ' లీకేజీ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 135 కోట్ల భారీ గ్రాస్‌తో బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్ల వేట మొదలుపెట్టింది. అయితే, ఈ ఆనందం చిత్ర యూనిట్‌కి ఎంతోసేపు నిలవలేదు. మొదటి రోజు ఊపు చూసి వీకెండ్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ దాటేస్తుందని అంచనా వేసిన ట్రేడ్ వర్గాలకు.. రెండో రోజు కలెక్షన్ల డ్రాప్ గట్టి షాక్ ఇచ్చింది.

శని, ఆదివారాల వసూళ్లు అత్యంత కీలకంగా మారిన ఈ తరుణంలో.. ఈ కలెక్షన్ల క్షీణతకు ప్రధాన కారణం ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ‘పైరసీ ప్రింట్’ అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే మొదటి రోజు సాయంత్రానికో లేదా మరుసటి రోజుకో థియేటర్ ప్రింట్లు వస్తుంటాయి. కానీ ‘పెద్ది’ విషయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ఓవైపు ఓవర్సీస్, పక్క రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు పడే సమయానికే ఇంటర్నెట్‌లో పైరసీ లింకులు ప్రత్యక్షమయ్యాయి. అంటే ప్రీమియర్ల నుంచే లీకేజీ స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడితో ఆగకుండా.. సినిమా విడుదలైన మొదటి రోజు మధ్యాహ్నానికే ఏకంగా హై-క్వాలిటీ (HD Print) విజువల్స్ ఆన్‌లైన్ లోకి వచ్చేయడం చిత్ర‌యూనిట్‌ను షాక్‌కి గురిచేసింది.

ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని, యాంటీ పైరసీ టీమ్స్ ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇంకొకటి ఉంది. ప్రస్తుతం నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ‘పెద్ది’ ప్రింట్ ఏ థియేటర్ లోనో దొంగతనంగా మొబైల్ ఫోన్ తో రికార్డ్ చేసినట్లు లేదు. ఒకవేళ థియేటర్ లో రికార్డ్ చేస్తే ప్రేక్షకులతో కూడిన ఆడిటోరియంలో ఉండే అరుపులు, గోల, ఆడియో రీ-సౌండ్ వంటివి సహజంగానే వినిపిస్తాయి.

కానీ, ప్రస్తుతం లీకైన ప్రింట్ లో అలాంటి డిస్ట్రబెన్స్ ఏమీ లేదు. విజువల్ ఎంత క్లియర్ గా ఉందో, ఆడియో కూడా అంతే డిజిటల్ క్వాలిటీతో ఉంది. దీన్ని బట్టి చూస్తే.. థియేటర్ స్క్రీనింగ్ కాకుండా మరేదో ఇతర సోర్స్ (డిజిటల్ క్యూబ్స్ లేదా థియేట్రికల్ ఫీడ్స్) నుంచే ఈ కంటెంట్ నేరుగా డౌన్‌లోడ్ అయిందనేది స్పష్టమవుతోంది.

సినిమా ఫస్ట్ వీకెండ్ కూడా పూర్తి కాకుండానే, ఇంకా బ్రేక్ ఈవెన్ లక్ష్యానికి దూరంగా ఉన్న దశలోనే ఇలాంటి క్వాలిటీ ప్రింట్ ల్యాండ్ కావడం కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఒక మంచి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఇంతలా పైరసీ చెరలోకి నెట్టడం ఇండస్ట్రీకి తీరని నష్టం. మరి ఈ లీకేజీ మూలాలను పట్టుకుని, పైరసీ లింకులను తొలగించడంలో చిత్ర నిర్మాణ సంస్థ ‘వృద్ధి సినిమాస్’, ‘మైత్రీ మూవీ మేకర్స్’ యాంటీ పైరసీ విభాగాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment