డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోనే గట్టి షాక్ తగిలిందా? “పవన్ అంటే పిచ్చి” అని చెప్పుకునే యువత కూడా ఆయన సభల వైపు చూడటం లేదా? ఇటీవల పిఠాపురంలో జరిగిన పవన్ కళ్యాణ్ పర్యటన, బహిరంగ సభ చూసిన తర్వాత స్థానికంగా ఇదే చర్చ జోరుగా సాగుతోంది.
8 నెలల తర్వాత రాక..
ముక్కు, కుడి భుజం శస్త్రచికిత్సలు, కేరళంలో ఆయుర్వేద చికిత్సల పేరుతో దీర్ఘకాలం విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్, దాదాపు 8 నెలల విరామం తర్వాత తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో అడుగుపెట్టారు. సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజల వద్దకు వచ్చినప్పటికీ జనం నుంచి ఆశించిన స్పందన కరువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పవన్ సభలో మిగిలిన 7 వేల భోజనాలు
పిఠాపురంలో పవన్ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సభకు వేలాదిగా జనం వస్తారని ఆశించి నిర్వాహకులు భారీగా భోజన వసతి ఏర్పాటు చేశారు. అయితే, జనం రాకపోవడంతో ఏకంగా 7,000 భోజనాలు మిగిలిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. మిగిలిపోయిన ఆహారాన్ని పడేయలేక అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, యాచకులకు పంపిణీ చేశారని తెలుస్తోంది.
హైదరాబాద్, మంగళగిరికే పరిమితం..
సొంత నియోజకవర్గంలోనే సభకు జనం రాక, వేలల్లో భోజనాలు మిగిలిపోవడం పడిపోతున్న పవన్ కళ్యాణ్ గ్రాఫ్‌కు ప్రత్యక్ష సాక్ష్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, గెలిచిన తర్వాత హైదరాబాద్, మంగళగిరికే పరిమితమై, నియోజకవర్గానికి రాకపోవడం, స్థానిక టీడీపీ నేత వర్మను ఉద్దేశించి గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు, పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో నాగబాబు సమక్షంలో జరిగిన గొడలే కారణంగా చెబుతున్నారు.
సభలో జనం లేకపోవడాన్ని గమనించిన పవన్.. ఇకపై తన క్యాంపు కార్యాలయాన్ని పిఠాపురానికి తరలిస్తా.. ఇక్కడి నుంచే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారని అంటున్నారు.
ఒకప్పటి క్రేజ్ ఏదీ..?
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే సభలకు ఎగబడిన యువతకు ఆయన పట్ల నమ్మకం సన్నగిల్లిందని, పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయని చెబుతున్నారు. 7 వేల భోజనాలు మిగిలిపోవడం అనేది పిఠాపురం ప్రజల్లో ఆయన కోల్పోయిన ఆదరణకు కొలమానంగా అభిప్రాయపడుతున్నారు.








