ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సచివాలయంలో జరుగుతున్న కీలకమైన కేబినెట్ సమావేశంలో (Cabinet Meeting) ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అధ్యక్షతన కొనసాగుతున్న మంత్రివర్గ భేటీ మధ్యలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హఠాత్తుగా వెళ్ళిపోయారు. సమావేశం జరుగుతుండగా ఆయన తీవ్ర అస్వస్థతకు (Illness) గురైనట్లు జనసేన పార్టీ (Jana Sena Party) వర్గాలు వెల్లడించాయి. వెన్నునొప్పి సమస్య దీనికి కారణమని తెలుస్తోంది.
గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేబినెట్ భేటీ మధ్యలో వెన్నునొప్పి తీవ్రం కావడంతో, పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీ నుంచి బయటకు వచ్చేశారు. అక్కడ నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని (Mangalagiri) తన అధికారిక క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల పవన్ కళ్యాణ్ అనారోగ్య బారినపడిన విషయం తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్‌లోని (Hyderabad) ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు అక్కడ ఆయనకు పలు వైద్య పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ. (MRI) స్కానింగ్ కూడా నిర్వహించారు. ఆ స్కానింగ్ నివేదికల ఆధారంగా వైద్యులు ఆయనకు చిన్న శస్త్రచికిత్స (Surgery) చేశారు. ఆపరేషన్ తర్వాత పది రోజుల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో కేబినెట్ నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదేం మొదటిసారి కాదు..
ఆపరేషన్ తర్వాత కోలుకుని మళ్లీ కేబినెట్ భేటీ మధ్యలోనే అస్వస్థతతో వెనుతిరగడం జనసైనికులను, మెగా అభిమానులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. అయితే, పవన్ కళ్యాణ్‌కు ఆరోగ్య సమస్యల కారణంగా కేబినెట్ సమావేశాలకు దూరం కావడం ఇదే కొత్తేమీ కాదని పార్టీ సీనియర్లు గుర్తుచేస్తున్నారు. గతంలో కూడా తీవ్రమైన వెన్నునొప్పి, జ్వరం కారణంగా ఆయన పలుమార్లు మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరయ్యారని చెబుతున్నారు.








