“ప్రశ్నించడానికే వచ్చా.. మార్పు కోసమే పార్టీ పెట్టా” – 2014 మార్చి 14న హైదరాబాద్‌లోని (Hyderabad) ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో (International Convention Centre) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నోటి నుంచి వచ్చిన ఈ మాటలు విన్నప్పుడు ఏపీ (Andhra Pradesh) రాజకీయాల్లో ఒక సరికొత్త శకం మొదలైందని భావించారు. కానీ, పుష్కర కాలం గడిచేసరికి ఆ నినాదాలు కేవలం ‘స్క్రిప్ట్’ మాటలుగానే మిగిలిపోయాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన (Jana Sena Party) 12 ఏళ్ల ప్రస్థానాన్ని నిశితంగా పరిశీలిస్తే.. అది ఒక రాజకీయ పార్టీ ప్రస్థానంలా కాకుండా, చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu) రాజకీయ ప్రయోజనాల కోసం నడిచిన ఒక ‘అనుబంధ విభాగం’ (Affiliate Wing) లాగే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు సేవలో.. జనసేన తరిస్తోందా..?
పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం మొదలైన నాటి నుంచి నేటి వరకు ఆయన అడుగులన్నీ చంద్రబాబు కోసం, టీడీపీ(TDP) కోసం పనిచేశాయంటున్నారు విశ్లేషకులు. 2014లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా బాబు కోసం ప్రచారం చేశారు. 2019లో విడిగా పోటీ చేసినా, లోపాయికారీగా టీడీపీకి మేలు చేసేలా ఓట్ల చీలికకు ప్రయత్నించారనే విమర్శలున్నాయి.
ఇక 2024లో జనసేన అభ్యర్థులను ఖరారు చేయడం నుంచి, నిధుల సమీకరణ వరకు అంతా చంద్రబాబే చూసుకున్నారన్నది బహిరంగ రహస్యం అంటున్నారు రాజకీయ పండితులు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా పవన్‌కు పట్టు లేకపోవడానికి కారణం.. వారంతా చంద్రబాబు పంపిన మనుషులే కావడమేనని, ఇటీవల జరిగిన జనసేన ఎల్పీ మీటింగ్‌లోనూ పవన్ అలిగి వెళ్లిపోయిన సందర్భాన్ని గుర్తుచేస్తున్నారు.
షణ్ముఖ వ్యూహం ఎక్కడ?
ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ‘షణ్ముఖ వ్యూహం’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. యువతకు ఉపాధి, స్టార్టప్‌లకు సబ్సిడీలు, జాబ్ క్యాలెండర్ అంటూ ఆశలు రేపారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ వ్యూహాల ఊసే లేదు. 2.66 లక్షల మంది వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు వారిని నట్టేట ముంచారని, 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని ఎన్నికల ముందు ఊదరగొట్టిన పవన్ ఈ రెండేళ్ల కాలంలో ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారనే ఆయనే చెప్పాలని ప్రశ్నలు సంధిస్తున్నారు.
కుల, మత రాజకీయాల యూ-టర్న్
“కులాలకు అతీతమైన రాజకీయం” అని చెప్పిన పవన్, తీరా పిఠాపురంలో గెలవడానికి తన సామాజికవర్గమైన కాపుల మద్దతును బహిరంగంగానే కోరారు. కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పిన పవన్, ఇప్పుడు ‘సనాతన ధర్మం’ పేరిట కొత్త అవతారమెత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆడుకున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. తనను నమ్మి వెంట నడిచిన కాపు సామాజికవర్గానికి పవన్ చేసిందేమీ లేదు. ముద్రగడ పద్మనాభంపై అప్పట్లో దాడులు జరిగినప్పుడు గానీ, తాజాగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు గానీ పవన్ స్పందించలేదు. ‘కాపు నేస్తం’ వంటి పథకాలు అగిపోతున్నా ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారంటున్నారు విశ్లేషకులు.
ప్రజల కంటే సినిమాలే ముఖ్యమా..?
ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం లేని పవన్ కల్యాణ్.. సినిమాల కోసం మాత్రం షూటింగ్‌లకు వెళ్తున్నారు. అధికార హోదాను అడ్డుపెట్టుకుని తన సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచుకోవడం, బెనిఫిట్ షోలు వేసుకోవడంపైనే ఆయన దృష్టి అంతా ఉంది. సామాన్య ప్రేక్షకుల జేబులు కత్తరించడం ద్వారా తన వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడమే పరమావధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెడదోవలో యువత!
జనసేన శ్రేణులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా పవన్ మందలించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దాడులు చేయడం, భౌతిక దాడులకు దిగడం వంటి ఉన్మాద ధోరణులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. 12 ఏళ్ల రాజకీయాల్లో ఏ ఒక్క నిర్మాణాత్మక పోరాటం చేయని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన మాత్రమేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
సిద్ధాంతాలు లేని రాజకీయం.. చంద్రబాబు కనుసన్నల్లో నడిచే వైఖరి.. వెరసి జనసేన ఒక రాజకీయ పార్టీగా తన ఉనికిని కోల్పోతోందని, కాస్త పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. లేదంటే.. అటు సామాజికవర్గాన్ని, ఇటు యువతను వంచించిన పవన్ కల్యాణ్.. చరిత్రలో ఒక ‘అవకాశవాద రాజకీయ నేత’గా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.








