ప‌వ‌న్ ‘గన్ సరెండర్’ వెనుక అసలు నిజం ఇదే..

ప‌వ‌న్ 'గన్ సరెండర్' వెనుక అసలు నిజం ఇదే..

Summarize with AI

రాజకీయాల్లో గతాన్ని తవ్వుకోవడం, నాటి సంఘటనలను నేటి అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం నాయకులకు అలవాటే. అయితే, కొన్నిసార్లు ఆ కథల వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు వచ్చినప్పుడు విమర్శలకు తావిస్తుంటాయి. తాజాగా జనసేన (Jana Sena) అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతంలో తాను గన్ సరెండర్ (Gun Surrender) చేసిన ఉదంతాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy-YSR) హయాంతో ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

నేను వైఎస్సార్ ఉన్నప్పుడే నా తుపాకీని సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన మాటలపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ తన లైసెన్స్‌డ్ గన్‌ను ఎందుకు సరెండర్ చేయాల్సి వచ్చింది? దానికి, వైఎస్సార్ రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? నాటి అసలు కథేంటో ఒకసారి పరిశీలిద్దాం.

అసలు కథ 2007 అక్టోబర్‌లో మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చిన్న కుమార్తె శ్రీజ(Srija), శిరీష్ భరద్వాజ్ (Sirish Bharadwaj) అనే యువకుడిని ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఆర్యసమాజ్‌లో (Arya Samaj) వీరి వివాహం రహస్యంగా జరిగింది.

పెళ్లి అనంతరం తమకు చిరంజీవి కుటుంబం నుండి, ముఖ్యంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి ప్రాణహాని ఉందంటూ ఆ జంట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరింది. ఆ సమయంలో శ్రీజ కారులో ప్రయాణిస్తూ.. తనకు ప్రాణభయం ఉందంటూ విడుదల చేసిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఈ ఉదంతాన్ని అప్పట్లో కొన్ని ప్రధాన మీడియా ఛానళ్లు దావానలంలా ప్రసారం చేశాయి. మెగా ఫ్యామిలీపై, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్‌పై రౌడీయిజం, గూండాయిజం ముద్ర వేస్తూ కథనాలు ఇచ్చాయి.

పోలీస్ స్టేషన్‌కు పవన్.. గన్ సరెండర్!
తనపై వస్తున్న గూండాయిజం ఆరోపణలను, ప్రాణహాని పుకార్లపై స్పందించిన పవన్ కళ్యాణ్ 2007 అక్టోబర్ 22న ఆయనే స్వయంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ పిస్తోల్‌ను పోలీసులకు అప్పగించారు (డిపాజిట్ చేశారు).

“శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ, మా కుటుంబం నుండి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు రావడం నన్ను తీవ్రంగా బాధించింది. నాకు ఎలాంటి ప్రైవేట్ సైన్యాలు, రౌడీ మూకలు లేవు. నేను నా గన్‌ను సరెండర్ చేస్తున్నా. 1998లో మద్రాస్ రైఫిల్ క్లబ్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ లైసెన్స్‌డ్ గన్ తీసుకున్నాను. కొత్త జంటకు మా నుండి ఎలాంటి హానీ జరగదని నేను హామీ ఇస్తున్నాను” అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో 2007లో మాట్లాడారు.

ఆ తర్వాత చిరంజీవి కూడా స్పందిస్తూ.. తండ్రిగా ఈ నిర్ణయం తనకు షాక్ ఇచ్చినప్పటికీ, తన కుమార్తె ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వివాదాన్ని ముగించారు. కాలక్రమేణా శ్రీజ, శిరీష్ భరద్వాజ్ మధ్య విభేదాలు రావడంతో 2011లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీజ తిరిగి మెగా కుటుంబం చెంత‌కు చేరింది. దురదృష్టవశాత్తూ శిరీష్ భరద్వాజ్ జూన్ 2024లో ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు.

కుటుంబంలో జరిగిన ఒక అంతర్గత సమస్య, ఆరోపణల నేపథ్యంలో ఆనాడు పవన్ కళ్యాణ్ ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్‌ను సరెండర్ చేశారు. కానీ నేడు రాజకీయ వేదికలపై దాన్ని ప్రస్తావిస్తూ.. తాను వైఎస్సార్ హయాంలోనే గన్ సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చానని, నాడే ఎదిరించానని చెప్పుకోవడంపై విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిజాలు తెలిసిన రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు పవన్ కళ్యాణ్ వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనను, మీడియా ట్రోలింగ్‌ను తట్టుకోలేక చేసిన గన్ సరెండర్ వ్యవహారాన్ని.. నేడు ఏదో వైఎస్సార్‌ను ఎదిరించడానికి చేసిన వీరకృత్యంగా కలరింగ్ ఇవ్వడం నేటి తరానికి తప్పుడు సంకేతాలు పంపడమే అవుతుందని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పలకుబడి కోసం, క్యాడర్‌లో సెంటిమెంట్ రగల్చడం కోసం ఇలాంటి నాటి పాత కథలను వ‌క్రీక‌రించి మ‌రీ వాడుకోవ‌డం ఎంతవరకు సమంజసం అనేది జనసైనికులే ఆలోచించుకోవాలని స‌ల‌హా ఇస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment