పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ పాకిస్తాన్‌కు భారీ నష్టాన్ని కలిగించింది. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే కాకుండా, పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా పాక్ ఎయిర్ బేస్‌లపై కూడా దాడి చేసింది.
పాక్ ఎయిర్ బేసులకు రిపేర్లు:
భారత దాడుల వల్ల పాకిస్తాన్‌లోని కీలకమైన పలు ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం, పాకిస్తాన్ ఆ దెబ్బతిన్న ఎయిర్ బేసులకు మరమ్మతులు చేసుకుంటున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు 25 కి.మీ దూరంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై దాడి
మే 10న భారత వైమానిక దళం ఈ ఎయిర్ బేస్‌పై క్షిపణులతో దాడి చేసింది. బ్రహ్మోస్, స్కాల్ప్ క్షిపణులను భారత్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కూడా బ్రహ్మోస్ క్షిపణి దాడి జరిగిందని అంగీకరించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాక్ వైమానిక దళానికి కీలకమైన స్థావరం. ఇందులో అవాక్స్, C-130 రవాణా విమానాలు, IL-78 మిడ్-ఎయిర్ ఫ్యూలింగ్ విమానాలు ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ లాజిస్టిక్స్, నిఘా మరియు ఆపరేషన్లకు చాలా ముఖ్యమైనవి.
1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ వైమానిక దళం ‘ఆపరేషన్ సింధూర్’లో అత్యంత భారీ నష్టాన్ని చవిచూసిందని నిపుణులు చెబుతున్నారు. ఈ దాడుల వల్ల పాకిస్తాన్‌కు పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తోంది.








