పహల్గాం ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం కొనసాగుతోంది. జైష్-ఎ-మహ్మద్ (Jaish-e-Mohammed) , లష్కరే తొయిబా (Lashkar-e-Toiba) వంటి ఉగ్రవాద ముఠాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరుతో మెరుపుదాడులు జరిపింది. మే 7 అర్ధరాత్రి తరువాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రాంతాల్లో జరిపిన మిస్సైళ్ల దాడిలో తొమ్మిది కీలక ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు కేంద్రం (Central Government) ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఈ దాడుల్లో ఐదుగురు కీలక ఉగ్రనేతలు మరణించారని ఇండియన్ ఆర్మీ (Indian Army) వెల్లడించింది.
హతమైన కీలక ఉగ్రవాదులు:
- ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ : లష్కరే తొయిబాకు చెందిన ప్రధాన ఉగ్రవాది. ఇతడి అంత్యక్రియలను పాకిస్థాన్ ఆర్మీ అధికారికంగా నిర్వహించింది. హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
- హఫీజ్ మహమ్మద్ జమీల్ : జైషే మహమ్మద్ సంస్థకు చెందిన కీలక వ్యక్తి. సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది.
- మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ / సలీమ్ / సాహబ్ : జైషేకి చెందిన మరో కీలక ఉగ్రవాది. మసూద్ అజార్ బావమరిది. 1999 ఐసీ-814 విమాన హైజాక్ కేసులో ప్రధాన పాత్రధారి.
- ఖలీద్ అలియాస్ అబు అకాస : లష్కరే తయ్యిబా టాప్ కమాండర్. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు నాయకత్వం వహించాడు. అఫ్గానిస్థాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ చేశాడు. ఇతడి అంత్యక్రియలకు ఫైసలాబాద్‌లో పాక్ సైన్యం ఉన్నతాధికారులు హాజరయ్యారు.
- మహమ్మద్ హసన్ ఖాన్ : జైషే మహమ్మద్ కీలక నేత. జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను చొప్పించడం ఇతడి బాధ్యత.








