గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ఉత్తర-పశ్చిమ భారత ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఢిల్లీ-NCR సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం మరోసారి వేగంగా మారబోతోంది. మే 11 నుండి 14 మధ్య బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
తీవ్రమైన గాలులు – పిడుగులు
IMD నివేదిక ప్రకారం, రాబోయే నాలుగు రోజుల్లో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దీనికి తోడు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో మే 11, 12 తేదీలకు సంబంధించి వాతావరణ శాఖ ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది. ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారనుంది.
ప్రభావితమయ్యే రాష్ట్రాలు
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుపానులు వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలతో పాటు అక్కడక్కడా మంచు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరాదిలో వర్షాలు కురుస్తున్నప్పటికీ, పశ్చిమ రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 7 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో హీట్‌వేవ్ (వడగాల్పులు) ప్రభావం కొనసాగనుంది. ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రాకూడదని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు. కేవలం ఉత్తరాదిలోనే కాకుండా, దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా రాబోయే వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.








