దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన నీట్ యూజీ 2026 పరీక్షపై ఎట్టకేలకు కీలక నిర్ణయం వెలువడింది. ప్రశ్నపత్రం లీక్, అవకతవకల ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో, పరీక్షను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా రీ-ఎగ్జామ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్టీఏ తెలిపింది.
మే 3న జరిగిన పరీక్షలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలుచోట్ల కోర్టుల్లో పిటిషన్లు దాఖలుకాగా, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం రీ-ఎగ్జామ్‌పై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి పరీక్ష నిర్వహణలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల రవాణా నుంచి పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు.








