స్పీకర్‌కు ఆ అధికారం ఉండకూడదు – వీడ్కోల స‌భ‌లో పిల్లి సుభాష్‌ కీల‌క వ్యాఖ్య‌లు

స్పీకర్‌కు ఆ అధికారం ఉండకూడదు - వీడ్కోల స‌భ‌లో పిల్లి సుభాష్‌ కీల‌క వ్యాఖ్య‌లు

Summarize with AI

రాజ్యసభ (Rajya Sabha) నుంచి పదవీ విరమణ పొందుతున్న ఎంపీల(MPs) వీడ్కోలు కార్యక్రమంలో వైసీపీ (YSR Congress Party ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) కీలక ప్రసంగం చేశారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ ఫిరాయింపుల చట్టం వైఫల్యం మరియు సమాచార హక్కు చట్టం (RTI) నిర్వీర్యం అవుతున్న తీరుపై ఆయన గళమెత్తారు. తన ప్రసంగంలో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ పార్లమెంటుకు పలు సూచనలు చేశారు.

పార్లమెంట్ మెట్లెక్కిన తొలి వ్యక్తిని..
తన రాజకీయ ఎదుగుదలపై స్పందిస్తూ.. “వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఆశీస్సులతో మా కమ్యూనిటీ నుంచి పార్లమెంట్ మెట్లు ఎక్కిన తొలి వ్యక్తిని నేను. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు” అని బోస్ పేర్కొన్నారు.

పార్టీ ఫిరాయింపుల (Defections Issue) అంశంపై ఆయన సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రాల్లో ఫిరాయింపులు యథేచ్ఛగా కొనసాగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. చట్టాలకు తూట్లు పొడుస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటే ఇక పార్లమెంటు ఎందుకు? చట్టాలు ఎందుకు?” అని ప్రశ్నించారు. ఫిరాయింపుల కేసుల్లో స్పీకర్‌ను (Speaker) జడ్జి స్థానం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులను నేరుగా హైకోర్టులకే అప్పగించాలని సూచించారు.

ఫిరాయింపుల ఫిర్యాదులపై మూడు నుంచి ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ఉండాలని, అప్పుడే చట్టానికి సార్థకత చేకూరుతుందని చెప్పారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లే వారిని, ఆ టర్మ్ ముగిసే వరకు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరారు.

జీవోల రహస్యం.. ఆర్టీఐ నిర్వీర్యం
రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. “రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం పూర్తిగా నిర్వీర్యమవుతోంది. అవినీతి, బంధుప్రీతిని కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జీవోలను (GOs) వెబ్‌సైట్లలో పెట్టకుండా దాచిపెడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది
ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పార్లమెంట్ చేసిన చట్టాలు దేనికీ పనికిరావు అనే పరిస్థితి రాకుండా ఉండాలంటే, వెంటనే చట్టాలను సవరించి మరింత పటిష్టంగా అమలు చేయాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంటుకు విన్నవించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment