ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై మూడు సీజన్లతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘మీర్జాపూర్’. పగ, ప్రతీకారం, అధికారం, రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథ ఇప్పుడు ‘మీర్జాపూర్: ది మూవీ’గా వెండితెరపైకి వచ్చింది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా.. సిరీస్‌కు నేరుగా కొనసాగింపుగా కాకుండా, మొదటి సీజన్‌లో జరిగిన సంఘటనల సమయంలో సాగే ఓ సమాంతర కథగా తెరకెక్కింది.
మరి ఓటీటీలో సంచలనం సృష్టించిన మీర్జాపూర్ ప్రపంచం బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? సిరీస్ చూడని ప్రేక్షకులకు కూడా సినిమా అర్థమయ్యేలా ఉందా? మూడు గంటలకు పైగా సాగిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.
కథేంటి?
మీర్జాపూర్ సింహాసనాన్ని ఎవరు దక్కించుకుంటే.. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను, అక్కడి అధికార సమీకరణాలను వారు శాసించగలరనే విషయం ‘మీర్జాపూర్’ సిరీస్ అభిమానులకు తెలిసిందే. ప్రస్తుతం ఆ సామ్రాజ్యానికి అప్రకటిత చక్రవర్తిగా కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కొనసాగుతుంటాడు. అయితే తన కొడుకు మున్నా భయ్యా (దివ్యేందు) దూకుడు, ఆవేశపూరిత స్వభావంపై నమ్మకం లేని కాలీన్ భయ్యా.. తన సామ్రాజ్య బాధ్యతలను గుడ్డు పండిట్ (అలీ ఫజల్), బబ్లూ పండిట్లకు అప్పగిస్తాడు. దీంతో మున్నా, పండిట్ బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు మొదలవుతుంది.
ఇదే సమయంలో జైసల్మేర్‌కు చెందిన శక్తివంతమైన వ్యాపారవేత్త బబన్ యాదవ్ (రవి కిషన్) రంగంలోకి దిగుతాడు. మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో అతడు వేసే వ్యూహాలు కథను మరో మలుపు తిప్పుతాయి. బబన్ యాదవ్ అసలు ప్లాన్ ఏంటి? కాలీన్ భయ్యాతో అతడికి జరిగిన డీల్ ఏమిటి? ఒకరంటే ఒకరికి పడని గుడ్డు, మున్నా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరకు మీర్జాపూర్ సింహాసనం ఎవరికి దక్కుతుంది? అనేదే మిగతా కథ.
సినిమా ఎలా ఉంది?
ఓటీటీలో ఇప్పటికే భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న ఓ వెబ్ సిరీస్‌ను సినిమాగా మార్చడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా సిరీస్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుతూనే థియేటర్ ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్‌ను జోడించడం దర్శకుడికి పెద్ద సవాలే. ఈ విషయంలో గుర్మీత్ సింగ్ కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ‘మీర్జాపూర్’కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన పవర్ గేమ్, రా యాక్షన్, మాస్ డైలాగ్స్, బ్లాక్ హ్యూమర్ వంటి అంశాలను సినిమాలోనూ కొనసాగించారు. ముఖ్యంగా మీర్జాపూర్, జైసల్మేర్ ప్రాంతాల మధ్య ఉన్న కనెక్షన్‌ను దర్శకుడు ఆసక్తికరంగా ఎలివేట్ చేశాడు. అయితే సినిమా నిడివి మాత్రం పెద్ద మైనస్‌గా మారింది. మూడు గంటలకు పైగా సాగడంతో కొన్ని చోట్ల ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
ఫస్టాఫ్ కాస్త స్లో..
ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగుతుంది. ఇప్పటికే సిరీస్‌లో పరిచయమైన పాత్రలను మరోసారి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కథ ముందుకు వెళ్లేందుకు కొంత సమయం పడుతుంది. దీనికి తోడు గుడ్డు, బబ్లూ లవ్ స్టోరీలకు ఇచ్చిన స్పేస్, కొన్ని పాటలు కథా గమనాన్ని కాస్త నెమ్మదింపజేస్తాయి. అయితే ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. జైసల్మేర్ ఎపిసోడ్స్, కార్ చేజింగ్ సీక్వెన్స్, గుడ్డు-మున్నా ఫేస్‌ఆఫ్ వంటి సన్నివేశాలు థియేటర్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి.
చివరి గంటే అసలైన బలం
సినిమాకు అసలైన బలం చివరి గంటలో కనిపిస్తుంది. కాలీన్ భయ్యా కిడ్నాప్, బబ్లూ తన తెలివితేటలతో అతడిని గుర్తించే విధానం, ఆ తర్వాత వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. లాంగ్‌ఫార్మ్ వెబ్ సిరీస్ స్టోరీటెల్లింగ్‌ను దాదాపు మూడు గంటల సినిమాగా కుదించే క్రమంలో దర్శకుడు కొన్ని చోట్ల తడబడినప్పటికీ.. యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, అన్నదమ్ముల మధ్య ఈగో, అసూయ, అనుబంధాన్ని బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్స్ భవిష్యత్‌లో ‘మీర్జాపూర్’ ఫ్రాంచైజ్ నుంచి రాబోయే ప్రాజెక్టులపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. పెద్దగా హావభావాలు ప్రదర్శించకుండానే కేవలం చూపులు, బాడీ లాంగ్వేజ్‌తోనే పాత్రలోని పవర్‌ను చూపించారు.
- గుడ్డు పండిట్గా అలీ ఫజల్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. కండలు తిరిగిన లుక్‌తో పాటు అతడి యాక్షన్ పెర్ఫార్మెన్స్ అభిమానులను మెప్పిస్తుంది.
- బబ్లూ పండిట్ పాత్రలో విక్రాంత్ మాస్సే స్థానంలో వచ్చిన జితేంద్ర కుమార్ చక్కగా ఒదిగిపోయాడు. గుడ్డుకు బ్రెయిన్‌లా వ్యవహరించే పాత్రకు న్యాయం చేశాడు.
- అయితే అందరి ఫేవరెట్ మున్నా భయ్యాగా దివ్యేందు మరోసారి అదరగొట్టాడు. అతడి ఆటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకునేలా ఉన్నాయి.
- కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రవి కిషన్ విలన్‌గా సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. క్రూరత్వంతో పాటు రొమాంటిక్ షేడ్స్ ఉన్న పాత్రను తనదైన శైలిలో పోషించాడు.
- సోనాల్ చౌహాన్ గ్లామర్‌తో ఆకట్టుకోగా.. బీనాగా రసిక దుగల్‌కు ఈసారి మంచి ప్రాధాన్యత లభించింది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అయితే శ్రియ పిల్గావ్కర్, శ్వేతా త్రిపాఠి వంటి పాత్రలకు పెద్దగా స్కోప్ లేకపోవడం మైనస్.
- టెక్నికల్‌గా ఎలా ఉంది?
- సాంకేతికంగా ‘మీర్జాపూర్: ది మూవీ’ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సంజయ్ కపూర్ సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. ముఖ్యంగా రాజస్థాన్ ఎడారి ప్రాంతాల విజువల్స్ బిగ్ స్క్రీన్‌పై అద్భుతంగా కనిపిస్తాయి.
- జాన్ స్టీవర్ట్ ఎడూరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. రాప్ ట్రాక్స్ సినిమా స్వాగ్‌ను పెంచాయి.
- యాక్షన్ కొరియోగ్రఫీ స్టైలిష్‌గా, బ్రూటల్‌గా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు ప్లస్.
- తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది. అయితే మనన్ అశ్విన్ మెహతా ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో మరింత క్రిస్ప్‌గా ఉండాల్సింది. మూడు గంటలకు పైగా ఉన్న నిడివిని ఇంకాస్త తగ్గించి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.
- దర్శకుడు గుర్మీత్ సింగ్ బిగ్ స్క్రీన్‌పై ‘మీర్జాపూర్’ ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో సక్సెస్ అయినప్పటికీ.. స్క్రీన్‌ప్లేను మరింత బిగుతుగా రాసుకుని ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది. నిర్మాణ విలువలు మాత్రం అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
ఫైనల్లీ..
ఓటీటీలో ‘మీర్జాపూర్’కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. ‘మీర్జాపూర్: ది మూవీ’ ఆ స్థాయి ఇంపాక్ట్‌ను పూర్తిగా రీక్రియేట్ చేయకపోయినా, థియేటర్లలో మంచి గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ముఖ్యంగా మున్నా భయ్యా, గుడ్డు, కాలీన్ భయ్యా పాత్రలను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకునే అభిమానులకు సినిమా మంచి ట్రీట్. అయితే మూడు గంటలకు పైగా నిడివిని ఓర్చుకోగలిగితేనే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎంజాయ్ చేయగలరు.
రేటింగ్: 2.75/5








