దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామి (Sri Venkateswara Swamy) కొండపై మరోసారి చిరుత (Leopard) సంచారం భక్తులను (Devotees) కలవరపెడుతోంది. సోమవారం ఉదయం రెండవ ఘాట్ రోడ్డు (Second Ghat Road) లో నడక దారికి సమీపంగా చిరుత పులి భక్తుల కంటపడింది. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గతంలో ఇదే మార్గంలో ఒక చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి ప్రాణాలు తీయడం ఇంకా భక్తులెవరూ మరిచిపోలేదు. తాజా పరిణామాలతో భక్తులు మరింత అప్రమత్తంగా మారారు. అటవీ శాఖ (Forest Department) తో పాటు టీటీడీ అధికారులు (TTD Officials) వెంటనే స్పందించి తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరుత ఆచూకీ కోసం డ్రోన్‌లు, కెమెరాల ద్వారా గాలింపు కొనసాగుతోంది.
తిరుమల శ్రీవారి భక్తులు ఎక్కువ మంది కాలినడకనే కొండపైకి వెళ్తుంటారు. చిరుత సంచారాల నేపథ్యంలో గతంలో భక్తులు ఒంటరిగా వెళ్లకూడదని, గుంపులుగా వెళ్లాలనే నిబంధన తెచ్చారు. ఒంటరిగా మెట్ల మార్గంలో వెళ్తే చిరుత పులులు దాడులు చేసే ప్రమాదం ఉందని, గుంపులుగా వెళ్లాలని, భక్తులకు చేతికర్రలు సైతం అందించారు. అప్పట్లో కొంతమంది చేతికర్రలు ఇవ్వడాన్ని ట్రోల్ చేసినా, ఆ తరువాత నడక దారిలో చిరుత దాడులు జరగలేదు. తాజాగా కొండపై చిరుత పులి భక్తుల కంటపడడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.