‘మన శంకర్ వరప్రసాద్’లో వెంకీ పాత్రపై డైరెక్టర్ కీలక అప్డేట్

‘మన శంకర్ వరప్రసాద్’లో వెంకీ పాత్రపై డైరెక్టర్ కీలక అప్డేట్

Summarize with AI

చిరంజీవి (Megastar Chiranjeevi) న‌టించిన ‘మన శంకర్ వరప్రసాద్’ (Mana Shankar Varaprasad) సినిమా సంక్రాంతి పండుగకు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి (Director Anil Ravipudi) విజయవాడ (Vijayawada)కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మవారిని (Kanaka Durga Temple) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి సినిమా విశేషాలు, మెగాస్టార్ చిరంజీవితో తన అనుబంధం, సంక్రాంతి రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మన శంకర్ వరప్రసాద్’ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని అనిల్ రావిపూడి తెలిపారు. “మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఒక దర్శకుడిగా చిరంజీవితో సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పారు. తన ఎనిమిది సినిమాల్లో మూడుసార్లు సంక్రాంతికి సినిమాలు వచ్చాయని, ఈసారి మెగాస్టార్‌తో తీసిన చిత్రం కూడా సంక్రాంతికే రావడం విశేషమన్నారు.

చిరంజీవి కామెడీ, డ్యాన్స్ హైలైట్
ఈ చిత్రంలో చిరంజీవిలోని అద్భుతమైన కామెడీ టైమింగ్‌ను పూర్తిగా బయటకు తీశామన్నారు. “మెగాస్టార్ అద్భుతమైన డ్యాన్స్, హ్యాండ్సమ్ లుక్‌తో కనిపిస్తారు. ఈ సినిమా కోసం ఆయన ఫిట్నెస్‌పై చాలా కష్టపడ్డారు” అని చెప్పారు.

నయనతార, వెంకటేష్ స్పెషల్
నయనతార శశిరేఖ పాత్రలో పూర్తిగా జీవించారన్నారు. చిత్రంలోని చివరి 13 నిమిషాల్లో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) గారు ఇరగదీస్తారు అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. గుంటూరులోని విజ్ఞాన యూనివర్సిటీలో చిరంజీవి–వెంకటేష్ కలిసి చిత్రీకరించిన పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ‘మీసాల పిల్ల’ పాట 100 మిలియన్ల వ్యూస్ దాటిందని, ‘శశిరేఖా’ పాట 30 మిలియన్లకు చేరుకుందని తెలిపారు. ట్రైలర్‌ను కూడా త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.

“ఈ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా, మంచి మెసేజ్‌తో కూడిన చిత్రం. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే నా లక్ష్యం” అన్నారు. బీమ్స్ సంగీతం అల్టిమేట్‌గా ఉందని, మ్యూజికల్ వినోదం, యాక్షన్ సన్నివేశాలు అన్నీ ఈ చిత్రంలో ఉంటాయని స్పష్టం చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం కోసం కూడా ఎదురుచూస్తున్నామని, ఆ సినిమా కూడా హిట్ కావాలని కోరుకున్నారు. “సీనియర్స్ తర్వాతే మేము” అని ప్రభాస్ చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని ప్రశంసించారు. జనవరి 8న ‘రాజా సాబ్’ సినిమా చూస్తామని తెలిపారు.

ట్రోలింగ్‌లు ఇప్పుడు సాధారణమైపోయాయని, వాటిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.“చిత్ర పరిశ్రమకు నాలుగు పిల్లర్స్ ఉన్నారు – చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. వీరిలో ముగ్గురితో ఇప్పటికే సినిమాలు చేశాను. నాగార్జునతో ‘హలో బ్రదర్’ లాంటి సినిమా చేయాలనే కోరిక ఉంది” అన్నారు.

ఎప్పుడూ ప్రమోషన్స్ చేయని నయనతార తనతో కలిసి ప్రమోషన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. న్యూ ఇయర్ రోజున నయనతారతో కలిసి ఓ స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పారు. మొత్తానికి, ‘మన శంకర్ వరప్రసాద్’ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని అనిల్ రావిపూడి వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment