రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల కాకపోవడంతో నిరుద్యోగ యువత (Unemployed Youth) తీవ్ర ఆవేదన చెందుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలానికి చెందిన నిరుద్యోగి గడ్డం వేణు కుమార్ (Gaddam Venu Kumar) ఉద్యోగాలు రాక ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చట్టసభలో జాబ్ క్యాలెండర్ (Job Calendar) ప్రకటించి రెండేళ్లవుతున్నా అమలు చేయడం లేదని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీలు (Congress Promises) నీటిమూటలయ్యాయని విమర్శించారు. ఉద్యోగాలు అడిగిన యువతను ఉద్దేశించి “ఎండ్రిన్ తాగి చావండి” అని మాట్లాడటం దారుణమని, రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సీఎం వ్యాఖ్యలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగి వేణు రాసిన లేఖ సూసైడ్ నోట్ (Suicide Note) కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాసిన ఛార్జ్‌షీట్ అని స్పష్టం చేశారు.
విద్యార్థులు (Students), విద్యా వ్యవస్థ (Education System) పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై కేటీఆర్ మండిపడ్డారు. ఇంజనీరింగ్ విద్యార్థులను “క్రిమినల్ వేస్ట్”(Criminal Waste) అనడం వారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీయడమేనని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఆ విద్యార్థులే బొందపెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో 150 మందికి పైగా గురుకుల విద్యార్థులు చనిపోయారని, విద్యాశాఖ మంత్రిగా సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దయచేసి యువత, నిరుద్యోగులు ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్‌ఎస్ నేతలను వేధిస్తున్నారని, సివిల్ సప్లై అక్రమాలను బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని (Peddi Sudarshan Reddy) ప్రభుత్వం తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తోందని కేటీఆర్ అన్నారు.








‘టీడీపీలో డబ్బులున్న వారికే సీట్లు’