తప్పుడు వార్తలతో తన వ్యక్తిగత, పొలిటికల్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న చంద్రబాబు అనుకూల మీడియాగా పేరున్న ఈనాడు పత్రికకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అబద్ధపు వార్తలను ప్రచురించిన దినపత్రిక ‘ఈనాడు’ యాజమాన్యం 48 గంటల్లో క్షమాపణలు, పత్రిక ఫస్ట్ పేజీలో వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలతో పాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
కోర్టు పరిధిలో ఉన్న అంశంలో వాస్తవాలను వక్రీకరించి, దురుద్దేశపూర్వకంగా తప్పుడు వార్తా కథనాన్ని ప్రచురించారని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ న్యాయవాదులు పేర్కొన్నారు.
ఫార్ములా-ఈ రేస్ కేసు విచారణకు సంబంధించి ఏసీబీ (ACB) అధికారులు కోర్టులో కేవలం ఒక మెమో దాఖలు చేశారు. అయితే ఆ అంశంపై కోర్టు ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు, విచారణ కూడా పూర్తి కాలేదు.
కానీ, ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చేసిందంటూ “కేటీఆర్ పాస్‌పోర్ట్ తాత్కాలిక జప్తుకు ఆదేశాలు” అనే శీర్షికతో ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
దీంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు యాజమాన్యం 48 గంటల వ్యవధిలో క్రింది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తప్పుడు వార్తను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మొదటి పేజీలోనే అదే ప్రాధాన్యతతో “మా నివేదికలో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాయడం తప్పు, ACB మెమో మాత్రమే వేసింది” అని స్పష్టం చేస్తూ నిరభ్యంతర క్షమాపణలు ప్రచురించాలని డిమాండ్ చేశారు.
ఈనాడు ఆన్‌లైన్ వెబ్‌సైట్, ఈ-పేపర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ తప్పు వార్తను తక్షణమే తొలగించాలి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని రిపోర్టర్‌కు ఎవరు చెప్పారో, ఏ డాక్యుమెంట్ ఆధారంగా రాశారో పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు.
48 గంటల్లోగా స్పందించి క్షమాపణలు చెప్పకపోతే సివిల్, క్రిమినల్ నష్టపరిహారం దాఖలు చేస్తామని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Press Council of India) లో ఫిర్యాదు చేసి చట్టపరమైన కోర్టు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.








