రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రైతులు

రాత్రి గుట్టుగా యూరియా తరలింపు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రైతులు

అస‌లే స‌రిప‌డా యూరియా అంద‌క, ఆ చాలీచాల‌ని యూరియా కోసం గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్‌లో వేచి చూస్తూ రైతులు అవ‌స్థ‌లు ప‌డుతుండ‌గా, కృష్ణా జిల్లాలో పీఏసీఎస్ నుంచి రాత్రివేళ యూరియా తరలింపు వ్యవహారం పెద్ద ఎత్తున కలకలం రేపింది. పెదపారుపూడి మండలం యలమర్రు పీఏసీఎస్ వద్ద రాత్రి వేళ గుట్టుగా యూరియా తరలింపున‌కు ప్రయత్నం చేసిన ఘటన బయటపడింది. ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానిక రైతులు ట్రాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అడ్డుకుని అధికారులను ప్రశ్నించారు.

రైతుల చెబుతున్న వివరాల ప్రకారం.. వారికి యూరియా సరిపడా అందడం లేదని, అరకొర సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అయితే అదే సమయంలో ట్రాక్టర్‌లో యూరియా బస్తాలను లోడ్ చేసి తరలించడాన్ని గుర్తించిన రైతులు ఆందోళనకు దిగారు. అయితే రాత్రి స‌మ‌యంలో ఏంట‌ని రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు న‌ములుతూ స‌మాధాన‌మివ్వ‌డంతో గొడ‌వ పెద్ద‌దైంది.

యూరియాను “చినపారుపూడి రైతులకు పంపిస్తున్నాం” అని అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో రైతులు నిలదీయడంతో వెంటనే బిల్లులు సిద్ధం చేసినట్టు తెలిసింది. అంతేకాదు, తమకు ఒక్క బస్తా ఇచ్చి, చినపారుపూడి రైతుల ర‌శీదుల్లో ఒక్కరికీ మూడు కట్టలు అని రాసి ఉండ‌డం చూసి ఆగ్ర‌హానికి గుర‌య్యారు. అధికారులు చెబుతున్న‌ట్లుగా “ఉదయం తరలిస్తే ఇబ్బంది ఏముంది? రాత్రి వేళల్లోనే ట్రాక్టర్ లోడింగ్ ఎందుకు?” అంటూ రైతులు నిలదీశారు.

ఒక్కొక్కరుగా గ్రామంలోని రైతులంతా పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లిస్తున్నార‌ని రైతులు ఆందోళ‌న‌కు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే యలమర్రు పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. ట్రాక్టర్‌లో లోడ్ చేసిన యూరియాను ఆఫీస్‌లోనే ఉంచివేసి, రైతులకు సర్ది చెప్పి పంపించేశారు. ఇప్పటికే యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకుండా, రహస్యంగా తరలించడమేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment