మేయర్ పీఠం సీపీఐదే..? కేటీఆర్ కాల్‌తో మారిన సమీకరణాలు

మేయర్ పీఠం సీపీఐదేనా? కేటీఆర్ కాల్‌తో మారిన సమీకరణాలు

Summarize with AI

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ సీపీఐకి బేషరతుగా మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న సీపీఐకి తాము పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి తెలియజేశారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. “మీరు గెలిచారు కాబట్టి మద్దతు ఇస్తాం” అన్న కేటీఆర్ వ్యాఖ్యలు కొత్త సమీకరణాలకు దారి తీశాయి.

సీపీఐకి ఈ పరిణామంతో మేయర్ పీఠం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. మేయర్ పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని కూనంనేని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరాభివృద్ధి దిశగా పనిచేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా మద్దతు ఇస్తామని ముందుకు వస్తే స్వాగతిస్తామని, మూర్ఖత్వంగా ఎవరి సహకారాన్నీ తిరస్కరించబోమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక బీఆర్ఎస్‌తో పాటు పలువురు ఇండిపెండెంట్లు కూడా సహకారం అందిస్తామని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే పొత్తుల విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు పార్టీ అంతర్గతంగా సమగ్ర చర్చ జరుపుతామని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు రోజుల్లో జరిగే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కొత్తగూడెం రాజకీయాలు హాట్ హాట్‌గా మారగా, మేయర్ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment