మేం ఏ టెండ‌ర్ల‌లో పాల్గొన‌లేదు – ‘కిమ్స్’ షాకింగ్ స్టేట్‌మెంట్‌

మేం ఏ టెండ‌ర్ల‌లో పాల్గొన‌లేదు - 'కిమ్స్' షాకింగ్ స్టేట్‌మెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)‌లో కూటమి ప్రభుత్వం (Coalition Government) రాష్ట్రంలోని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (Government Medical Colleges) పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో టెండర్ల విషయం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయకూడదని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైసీపీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది ప్రజల నుంచి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అయినప్పటికీ ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం వైపే అడుగులు వేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. అయితే ఈ నాలుగు కాలేజీల్లో ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే టెండర్లు (Tenders) వచ్చాయని, అందులో కిమ్స్ (KIMS) యాజమాన్యం ముందుకు వచ్చిందని ప్ర‌చారం జ‌రిగింది. అధికార పార్టీ అనుకూల ప‌త్రిక‌లు, ఛానెల్స్‌లోనూ ప్ర‌సారాలు వ‌చ్చాయి.

కిమ్స్ యాజమాన్యం షాక్
అయితే, జ‌రుగుతున్న ప్ర‌చారంపై ప్ర‌భుత్వానికి షాకిస్తూ కిమ్స్ యాజమాన్యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. “ఆదోని మెడికల్ కాలేజీకి మేము ఎలాంటి టెండర్లు వేయలేదు. టెండర్‌లో పాల్గొన్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం. ప్రభుత్వానికి అలాంటి ప్రతిపాదన, ఆలోచన కూడా మాకు లేదు” అని కిమ్స్ యాజమాన్యం తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో పీపీపీ టెండర్ల వ్యవహారం మరింత గందరగోళంగా మారింది.

మంత్రి సత్యకుమార్ వివరణ
కిమ్స్ ప్రకటనపై మీడియా మంత్రి సత్యకుమార్‌ను ప్రశ్నించగా, ఆయన మరో కీలక వివరణ ఇచ్చారు. “ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ యాజమాన్యం కాదు. కిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రాజేంద్రకుమార్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి వ్యక్తిగతంగా టెండర్ వేశారు. టెండర్ కూడా ఆయన పేరుతోనే దాఖలైంది” అని మంత్రి తెలిపారు. అదే సమయంలో కిమ్స్ పేరు రావడం ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే అని మంత్రి వివరణ ఇచ్చారు.

రాజకీయ వివాదంగా మారిన పీపీపీ అంశం
ఒక‌వైపు నాలుగింటికి ఒక టెండ‌ర్ మాత్ర‌మే వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌ర‌గ్గా, ఆ టెండ‌ర్‌ను కూడా తాము వేయ‌లేద‌ని కిమ్స్ ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. కిమ్స్‌లో ప‌నిచేసే డాక్ట‌ర్ టెండ‌ర్ వేశార‌న్న‌ వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ (Satyakumar) ప్ర‌క‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీకి అప్పగించే అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ వివాదంగా మారింది. ఒకవైపు ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని వైసీపీ ఆరోపిస్తుండగా, మరోవైపు టెండర్ల విషయంలో ప్రభుత్వ ప్రకటనలు – ప్రైవేట్ సంస్థల ఖండనలతో స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవిష్యత్ ఏమవుతుందోనన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment