కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. రెండ్రోజుల్లోనే మంత్రి రాజీనామా

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. రెండ్రోజుల్లోనే మంత్రి రాజీనామా

Summarize with AI

కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Government) రాజకీయ అలజడి మొద‌లైంది. కేబినెట్‌లో శాఖల కేటాయింపు అధికార పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీయడమే కాకుండా, ఏకంగా ఒక సీనియర్ మంత్రి రాజీనామాకు దారితీసింది. బుధవారం రోజే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత రామలింగారెడ్డి(Ramalinga Reddy). కేవలం రెండు రోజులు తిరక్కుండానే శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా (Resignation) సమర్పించడం కన్నడ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితోనే రామలింగారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో సిద్ధరామయ్య (Siddaramaiah) కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా విజయవంతంగా పనిచేసిన ఆయన.. తాజా డీకే శివకుమార్ కేబినెట్‌లో కీలకమైన ‘బెంగళూరు నగరాభివృద్ధి'(Bengaluru Urban Development) శాఖను ఆశించారు. అయితే, ఇటీవల జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అధిష్ఠానం ఆయనకు ‘ఇరిగేషన్'(Irrigation) (నీటి పారుదల) శాఖను కేటాయించింది.

రాజీనామా అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం డీకే శివకుమార్‌పై (DK Shivakumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ ఏర్పాటు సమయంలో తనకు ‘బెంగళూరు నగరాభివృద్ధి’ శాఖను కేటాయిస్తానని డీకే శివకుమార్ స్వయంగా హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ, తీరా సమయానికి ఇచ్చిన మాట తప్పి ఇరిగేష‌న్‌ (Irrigation) శాఖ కేటాయించడంతో నొచ్చుకున్నానని, అందుకే మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన బహిరంగంగా ప్రకటించారు.

ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే సీనియర్ నేత రాజీనామా చేయడంతో కర్ణాటక కాంగ్రెస్‌లో ముస‌లం మొద‌లైంది. సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య వర్గాలు రంగంలోకి దిగి రామలింగారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముసలం ఎటు దారితీస్తుందోనని కన్నడ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment