నాడు రంగా, ముద్ర‌గ‌డ‌.. నేడు అంబ‌టి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నాడు రంగా, ముద్ర‌గ‌డ‌.. నేడు అంబ‌టి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడే కాపు నేత‌ల‌పై వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి వెనుక సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు స్ప‌ష్టంగా ఉన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, అయితే ప్రశ్నించే గొంతులను దాడులతో అణిచివేయడం ఏ మాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

గత ఘటనలను గుర్తు చేసిన తోట త్రిమూర్తులు
తెలుగుదేశం పార్టీ చరిత్రను ప్రస్తావించిన తోట త్రిమూర్తులు, “టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడే నాడు వంగవీటి రంగా హ‌త్య జ‌రిగింది. రంగా రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక, దీక్ష చేస్తున్న ఆయన్ను కిరాతకంగా హత్య చేశారు. మ‌ళ్లీ 2014లో అధికారంలోకి వ‌చ్చాక కాపు ఉద్య‌మ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబంపై దాడులు, కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించారు. నేడు అంబటి రాంబాబుపై దాడి చేశారు. రేపు కాపు నేత‌ల‌మైన‌ మాపై కూడా దాడులు చేస్తారా?” అని ప్రశ్నించారు.

రాజ‌కీయంగా కీల‌కంగా ఉన్న కాపు నేత‌లు తునిలో దాడిశెట్టి రాజాపై, రాజమండ్రిలో జక్కంపూడి కుటుంబంపై, కాకినాడలో కురసాల కన్నబాబు కూడా దాడులకు తెగ‌బ‌డ‌తారా..? అని ప్ర‌శ్నించారు. కాపు నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

ముద్రగడ ఉద్యమంపై దమనకాండ
కాపుల రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేసులు నమోదు చేసి, కిర్లంపూడిలో భయానక పరిస్థితులు సృష్టించారు. ముద్రగడతో పాటు ఆయన భార్యపై కూడా అసభ్యకర పదజాలంతో దూషణలకు దిగారని, కాపుల‌ను రాజకీయంగా అణిచివేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వ్య‌క్తం అవుతున్నాయి.

వరుస దాడులపై తీవ్ర ఆందోళన
తెలుగుదేశం ప్రభుత్వంలో వరుసగా కాపు నేతలపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తోట త్రిమూర్తులు అన్నారు. రాజకీయంగా బలంగా ఉన్న అంబటి రాంబాబుపై అత్యంత దారుణంగా టీడీపీ శ్రేణులు దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రశ్నించే స్వరం మీద దాడులు చేస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని తోట త్రిమూర్తులు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment