రాష్ట్రంలో గాడితప్పిన పాలన కొనసాగుతోందని, రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నానని కాపు ఉద్యమ నేత, వైసీపీ పీఏసీ మెంబర్ ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజినీ, జోగి రమేష్‌లను ఘోరంగా అవమానించారని పేర్కొంటూ, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిగతంగా, కుటుంబాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు.
తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ ఇచ్చిన నివేదికతో, గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తేలిపోయాయన్నారు. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు ప్రభుత్వం తంటాలు పడుతోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు పార్టీకి కూడా భారీ నష్టం వాటిల్లిందని వ్యాఖ్యానించారు.
కాపులపై కక్ష సాధింపు చర్యలు
మీ పరిపాలనలో కాపు కులాన్ని నిరంతరం టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. గతంలో తన కుటుంబాన్ని అవమానించారని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించారని తెలిపారు. కాపులపై చంద్రబాబుకు ఎప్పుడూ కోపమే కనిపిస్తోందని, అదే ఆయన చర్యల్లో బయటపడుతోందన్నారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చి, చివరికి మొండి చేయి చూపించారని ముద్రగడ గుర్తు చేశారు. అయినా కూడా డిప్యూటీ సీఎం పట్ల ఉన్న విశ్వాసంతో కాపులు మళ్లీ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని తెలిపారు.
లేఖ చివర్లో ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. “దయచేసి కాపులను ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమమే చేయండి” అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కాపు సమాజాన్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి, సీఎం చంద్రబాబు పాలనపై ముద్రగడ పద్మనాభం రాసిన ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారాన్ని రేపుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.








