సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. దీంతో తమిళ సినిమా చరిత్రలో మూడో అతిపెద్ద వరల్డ్‌వైడ్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. భారత్‌లో రూ.59.70 కోట్ల నెట్, రూ.70.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా.. ఓవర్సీస్ మార్కెట్ నుంచి సుమారు రూ.55 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. తమిళ వెర్షన్ అత్యధికంగా రూ.43.35 కోట్ల నెట్ వసూలు చేయగా, తెలుగు వెర్షన్ రూ.12.50 కోట్లు, హిందీ వెర్షన్ రూ.3.50 కోట్లు, కన్నడ వెర్షన్ రూ.35 లక్షల నెట్ కలెక్షన్లు సాధించాయి.
తొలి రోజు వసూళ్లలో తమిళనాడు నుంచి రూ.24 కోట్ల గ్రాస్, కర్ణాటక నుంచి రూ.14.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ నుంచి కలిపి రూ.14.50 కోట్లు, కేరళ నుంచి రూ.12.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా. అయితే తమిళ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ రికార్డును ‘జైలర్ 2’ అందుకోలేకపోయింది. రజినీకాంత్ నటించిన ‘కూలీ’ రూ.151.10 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, విజయ్ ‘లియో’ రూ.142 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ‘జైలర్ 2’లో రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించగా, రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. భారీ ఓపెనింగ్‌తో ప్రారంభమైన ఈ సినిమా రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో ఆసక్తికరంగా మారింది.








