స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు ఆవిరి

భారత స్టాక్ మార్కెట్ (Indian Stock Market) నేడు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. అంతర్జాతీయ మార్కెట్ల (Global Markets) నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు భారీగా కుప్పకూలాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (Bombay Stock Exchange – BSE) సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయి రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది.

ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కొనసాగిన సెన్సెక్స్‌, ఒక దశలో 1,200 పాయింట్లకు పైగా పతనమైంది. ఇంట్రాడేలో 82,010.58 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ, చివరకు 1,065.71 పాయింట్ల నష్టంతో 82,180.47 వద్ద ముగిసింది. క్రితం ముగింపు 83,246.18తో పోలిస్తే భారీ నష్టం నమోదైంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా ఇదే ధోరణిని అనుసరించింది. నిఫ్టీ రోజంతా నష్టాల్లోనే ట్రేడ్ అయి, 25,200 స్థాయి దిగువకు చేరింది. చివరకు 353 పాయింట్ల నష్టంతో 25,232.50 వద్ద స్థిరపడింది. ఈ పతనంతో ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర ఆవిరైనట్లు అంచనా.

హెవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాలు పెరగడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా మారింది. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఎటెర్నల్‌, బజాజ్ ఫైనాన్స్‌, సన్ ఫార్మా, ఇండిగో, ట్రెంట్ వంటి షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. దాదాపు అన్ని రంగాలు నేడు రెడ్ క‌ల‌ర్‌లోనే ట్రేడ్ కావడం గమనార్హం.

ఇదే సమయంలో డాలరుతో రూపాయి మారకం విలువ 90.97 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా సమీప కాలంలోనూ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment