శ్రీలంకతో (Sri Lanka) ఆగస్టు 15 నుంచి గాలే (Galle) వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో(First Test) టీమిండియా (Team India) ముగ్గురు స్పిన్నర్లతో(Three Spinners) బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) మాట్లాడుతూ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav), రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మానవ్ సుతార్‌లను (Manav Suthar) ఒకే మ్యాచ్‌లో ఆడించడం తమకు సమస్య కాదని చెప్పడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి. గాలే పిచ్ మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో మూడు విభిన్న స్పిన్ ఆప్షన్లు 20 వికెట్లు పడగొట్టేందుకు ఉపయోగపడతాయని మోర్కెల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)అందుబాటులో లేకపోవడంతో మహ్మద్ సిరాజ్‌తో (Mohammed Siraj) కలిసి రెండో పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్నూర్ బ్రార్‌లో ఒకరికి అవకాశం దక్కే అవకాశముంది.
బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా, దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో, రిషభ్ పంత్ ఐదో స్థానంలో ఆడే అవకాశం ఉంది. సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్‌లో జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్, సిరాజ్‌తో పాటు రెండో పేసర్‌గా ప్రసిద్ధ్ లేదా గుర్నూర్లో ఒకరిని ఎంపిక చేయవచ్చు. అయితే తుది ప్లేయింగ్-11ను టాస్కు ముందు మాత్రమే అధికారికంగా వెల్లడించనున్నారు. గాలేలో భారత్ మూడు స్పిన్నర్ల వ్యూహాన్ని అనుసరిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







