ఇరాన్ అణు స్థావరాలను (Iran Nuclear Sites) ధ్వంసం చేయడానికి అమెరికా (America) ఉపయోగించిన బంకర్ క్లస్టర్ (Bunker Cluster) బాంబులు ప్రపంచ దృష్టిని మరోసారి ఆకర్షించాయి. ఇప్పుడు భారత్ (India) కూడా ఇదే తరహా ఆయుధాలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఎంతటి లోతైన లక్ష్యాల్లోకైనా చొచ్చుకెళ్లే శక్తిమంతమైన అస్త్రాన్ని సిద్ధం చేసేందుకు డీఆర్‌డీవో (DRDO) కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి యొక్క సవరించిన వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది.
అగ్ని-5 కొత్త నాన్-న్యూక్లియర్ వెర్షన్
భారత రక్షణ వ్యవస్థలో అత్యంత సమర్థవంతమైన ‘అగ్ని’ (Agni) సిరీస్ క్షిపణుల్లో సరికొత్త వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. అగ్ని-1 నుంచి అగ్ని-5 వరకు ఇప్పటికే వేర్వేరు వేరియంట్లు ఉన్నాయి. అగ్ని-1 రేంజ్ 700 కి.మీ నుంచి 1,200 కి.మీ వరకు ఉండగా, అగ్ని-5 క్షిపణి 5,000 నుంచి 8,000 కి.మీ దూరంలోని లక్ష్యాలను చేధించగల సామర్థ్యంతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా పేరుగాంచింది. ఇప్పుడు తాజాగా అగ్ని-5లో నాన్-న్యూక్లియర్ వెర్షన్ రాబోతోంది.
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అగ్ని-5 మిసైల్ కొత్త నాన్-న్యూక్లియర్ వెర్షన్‌ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ మిసైల్ ప్రత్యేకంగా భారత వైమానిక దళం (IAF) కోసం రూపొందిస్తున్నారు. ఇది శత్రువుల బలమైన కట్టడాలను సులభంగా ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
అగ్ని-5 కొత్త లక్షణాలు
కొత్త అగ్ని-5 మిసైల్‌లో 7.5 నుండి 8 టన్నుల బరువు గల వార్‌హెడ్ అమర్చేలా తయారు చేస్తున్నారు. ఈ మిసైల్ రెండు రకాలుగా ఉపయోగించేలా రూపొందిస్తున్నారు:
ఎయిర్‌బరస్ట్ విధానం: ఈ మిసైల్ గాలిలో పేలి విస్తృతమైన ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తుంది. ముఖ్యంగా శత్రువుల రన్‌వేలు, ఎయిర్‌బేస్‌లు, రాడార్ వ్యవస్థలను నాశనం చేయడంలో ఇది ప్రభావం చూపుతుంది.
బంకర్ బస్టర్ వార్‌హెడ్: ఇది భూమిలో 80 నుండి 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయి పేలుడు సృష్టిస్తుంది. శత్రువుల భూగర్భ కమాండ్ సెంటర్లు, అణ్వాయుధాలను నిల్వ చేసిన అండర్‌గ్రౌండ్ స్థావరాలను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్య అమెరికా ఇరాన్‌పై ఈ తరహా బాంబులను ప్రయోగించి న్యూక్లియర్ సైట్‌లను ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది.
భారత వైమానిక దళానికి అవసరం
ప్రస్తుతం భారత వైమానిక దళంలో అమెరికా ఉపయోగిస్తున్న B-2 బాంబర్, GBU-57 వంటి భారీ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన బాంబర్ విమానాలు లేవు. కొత్త అగ్ని-5 ఈ లోటును పూరిస్తుంది. 2,500 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ మిసైల్, భారీ వార్‌హెడ్‌ను మోసుకెళ్లి శత్రు ప్రాంతాలకు సులభంగా చేరుకోగలదు. అదే సమయంలో శత్రువుల మిసైల్ రక్షణ వ్యవస్థలను తప్పించుకుని దూసుకెళ్తుంది.
ఈ మిసైల్ ప్రత్యేకంగా పొరుగునే ఉండి భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న చైనా, పాకిస్తాన్‌లోని బలమైన సైనిక కట్టడాలను ధ్వంసం చేయడం కోసం రూపొందిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి, తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. కొత్త అగ్ని-5తో ఈ సామర్థ్యం మరింత పెరగనుంది.
సులభ రవాణా – వేగవంతమైన లాంచ్
ఈ మిసైల్‌ను రోడ్డు మార్గంలో ఎక్కడికైనా సులభంగా రవాణా చేయవచ్చు. అంతేకాదు, వేగంగా ప్రయోగించడానికి అనువుగా ఉంటుంది. ఇది భారత్‌కు శత్రువుల భారీ సైనిక స్థావరాలను దూరం నుంచే నాశనం చేయగల కొత్త శక్తిని అందిస్తుంది.
అగ్ని-5 మిసైల్ ఇప్పటికే భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. దీని న్యూక్లియర్ వెర్షన్ 5,000 కిలోమీటర్ల పరిధి కలిగి ఉండగా, కొత్త నాన్-న్యూక్లియర్ వెర్షన్‌తో వైమానిక దళానికి మరింత అదనపు బలాన్ని అందించనుంది. DRDO ఈ ప్రాజెక్ట్‌ను 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విజయవంతంగా ఈ మిస్సైల్‌ను అభివృద్ధి చేస్తే, భారత్ సైనిక సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆసియా ఖండంలో భౌగోళిక-రాజకీయ సమతుల్యతను కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.