మహిళల టీ20 ప్రపంచకప్-2026 (ICC Women’s T20 World Cup) షెడ్యూల్ (Schedule) విడుదలైంది. ఇంగ్లండ్ (England) వేదికగా జరిగే ఈ ఐసీసీ టోర్నీ వచ్చే ఏడాది జూన్ 12న ప్రారంభం కానుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
టోర్నీ వివరాలు, జట్ల విభజన
ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లు నేరుగా అర్హత సాధించగా, గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ప్రపంచకప్‌నకు అర్హత సాధించనున్నాయి.
ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు:
గ్రూప్-ఎ: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్తాన్, ఇంకా రెండు క్వాలిఫైయర్ జట్లు.
గ్రూప్-బి: ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంకా రెండు క్వాలిఫైయర్ జట్లు.
డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్, వేదికలు
చివరగా 2024లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ మైదానాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో జూన్ 12న మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ప్రారంభమై, జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌తో ముగియనుంది.
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్
ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరుగనుంది. అనంతరం గ్లోబల్ క్వాలిఫైయర్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న భారత్ తలపడుతుంది.
ఆ తర్వాత జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న మరో క్వాలిఫైయర్ జట్టుతో, జూన్ 28న పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.