జీవీఎంసీ కౌన్సిల్‌లో గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూముల క్రమబద్ధీకరణ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. చర్చకు అవకాశం ఇవ్వకుండానే అధికార దుర్వినియోగానికి పాల్పడి గీతంకు భూముల కేటాయింపును ఏకపక్షంగా ఆమోదించారని వైసీపీ ఆరోపించింది. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా మాట్లాడిన వైసీపీ సభ్యులను సస్పెండ్ చేసి, ప్రజాస్వామ్య స్వరాలను అణచివేశారని విమర్శించింది. కౌన్సిల్‌లో అభిప్రాయాలు చెప్పే హక్కును కూడా లాక్కోవడం ప్రజాస్వామ్యంపై దాడేనని పార్టీ నేతలు మండిపడ్డారు.
ఇక కౌన్సిల్ సమావేశం గూండాయిజానికి వేదికగా మారిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. మేయర్, టీడీపీ కార్పొరేటర్లు కలిసి వైసీపీ కార్పొరేటర్లపై దాడులకు దిగారని, తోసివేయడం, బెదిరింపులు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఈ గందరగోళంలో వైసీపీ కార్పొరేటర్ లక్ష్మణరావుకు గాయాలయ్యాయని పేర్కొంది. ప్రజా ప్రయోజనాల పేరుతో భూ దోపిడీకి తెరలేపి, ప్రశ్నించినవారిపై దౌర్జన్యం చేయడం తగదని వైసీపీ హెచ్చరిస్తూ, ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది.








