పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2026 విజేతగా జర్మనీ

పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2026 విజేతగా జర్మనీ

Summarize with AI

పురుషుల హాకీ ప్రపంచకప్‌ 2026లో జర్మనీ మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో ఆదివారం (ఆగస్టు 30) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌పై 1-0 గోల్‌ తేడాతో విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లు గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా స్కోరు నమోదు కాలేదు. స్పెయిన్‌ ఎక్కువసేపు బంతిని ఆధీనంలో ఉంచడంతో పాటు నాలుగు పెనాల్టీ కార్నర్లు సాధించినప్పటికీ.. జర్మనీ డిఫెన్స్‌ అద్భుతంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్‌లో 44వ నిమిషంలో మైకేల్‌ స్ట్రుతాఫ్‌ చేసిన గోల్‌తో జర్మనీ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు స్పెయిన్‌ తీవ్రంగా ప్రయత్నించినా జర్మనీ రక్షణను ఛేదించలేకపోయింది. మ్యాచ్‌ ముగియడానికి నాలుగు నిమిషాల లోపే స్పెయిన్‌ గోల్‌కీపర్‌ను వెనక్కి తీసుకుని అదనపు అవుట్‌ఫీల్డ్‌ ఆటగాడిని బరిలోకి దించినా ఫలితం మారలేదు.

ఈ విజయంతో జర్మనీ పురుషుల హాకీ ప్రపంచకప్‌ను నాలుగోసారి గెలుచుకుంది. గతంలో 2002, 2006, 2023లో టైటిల్స్‌ సాధించిన జర్మనీ.. 2026లోనూ విజేతగా నిలిచి పాకిస్థాన్‌ నాలుగు ప్రపంచకప్‌ టైటిళ్ల రికార్డును సమం చేసింది. మరోవైపు స్పెయిన్‌ మూడోసారి ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించి కాంస్య పతకం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో 16 జట్ల మధ్య మొత్తం 50 మ్యాచ్‌లు జరగగా, 248 గోల్స్‌ నమోదయ్యాయి. ఇందులో 136 ఫీల్డ్‌ గోల్స్‌, 97 పెనాల్టీ కార్నర్‌ గోల్స్‌, 15 పెనాల్టీ స్ట్రోక్‌ గోల్స్‌ ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment