మహిళా రిజర్వేషన్లు, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు పార్లమెంటులో బ్రేక్ పడింది. అత్యంత కీలకమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్ సభలో తగినంత మెజార్టీ లభించకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది.
ఓటింగ్ సరళి ఇలా..
బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓటింగ్‌ను నిర్వహించారు. ఆ సమయంలో సభలో మొత్తం 489 మంది సభ్యులు హాజరై ఓటు వేశారు. బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లు 489 పోలయ్యాయి.
బిల్లు ఎందుకు వీగిపోయింది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం, ఏదైనా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరై ఓటు వేసిన సభ్యులలో కనీసం రెండింట మూడొంతుల (2/3rd majority) మంది మద్దతు తెలపాలి. మొత్తం 489 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నప్పుడు, బిల్లు గెలవడానికి కనీసం 326 ఓట్లు (489లో 2/3 వంతు) అవసరం. కానీ, ప్రభుత్వానికి కేవలం 278 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే మెజార్టీకి మరో 48 ఓట్ల దూరంలో బిల్లు నిలిచిపోయింది.
లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలనే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆలోచన ప్రస్తుతానికి నిలిచిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా తాత్కాలికంగా ఆగిపోయింది. డీలిమిటేషన్ అంశంపై ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, ఓటింగ్ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి.
మొత్తం మీద, సాధారణ మెజార్టీ (సగం కంటే ఎక్కువ) ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు కావాల్సిన ప్రత్యేక మెజార్టీ లేకపోవడం వల్ల ఈ కీలక బిల్లు చట్టంగా మారలేకపోయింది. బిల్లు వీగిపోవడంతో మోడీ సర్కారుకు షాక్ తగిలింది. అయితే ఈ అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వాడుకుంటుందనే చర్చ అప్పుడే మొదలైంది.








