కర్ణాటకలోని బెళగావిలో నేటి నుంచి రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్” అని నామకరణం చేయడం గమనార్హం. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
ఈ భేటీలో సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత మరియు ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ప్రతినిధులు, మాజీ ముఖ్యమంత్రులు సహా 200 మందికిపైగా కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొంటారు. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
కేంద్రంలో బీజేపీ పాలనలో రాజ్యాంగ సంస్థలపై దాడులు, ప్రజాస్వామ్యానికి ఎదురైన సవాళ్లు ప్రధానంగా చర్చకు వస్తాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలపై సవివరంగా చర్చించనున్నారు. అదే విధంగా ఆర్థిక అసమానతలు, దేశవ్యాప్తంగా అభివృద్ధి లోపాలు వంటి అంశాలపై సీడబ్ల్యూసీ కీలక తీర్మానాలను ఆమోదించనుంది.
చారిత్రక ప్రాముఖ్యత..
1924లో ఇదే బెళగావిలో మహాత్మాగాంధీ తన తొలి ప్రసంగంలో అహింస, సహాయ నిరాకరణ, సామాజిక సమతుల్యత వంటి అంశాలపై ప్రసంగించారు. ఈ సంఘటనకు 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తోంది. రేపు (డిసెంబర్ 27) పార్టీ కార్యకర్తలు “జై బాపు, జై భీమ్, జై సమ్విధాన్” పేరుతో భారీ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు.