4 రోజుల్లోనే బీజేపీని దాటేసిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’.. దేశవ్యాప్తంగా ట్రెండ్

4 రోజుల్లోనే బీజేపీని దాటేసిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’.. దేశవ్యాప్తంగా ట్రెండ్

ప్రస్తుతం ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది… అదే ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party – CJP). కేవలం నాలుగే నాలుగు రోజుల్లో కోట్ల మంది నెటిజన్లను ఆకర్షించి, దేశంలోనే అత్యంత శక్తివంతమైన అధికార పార్టీ అయిన బీజేపీ (BJP) ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల రికార్డును సైతం బద్దలు కొట్టి ఈ వ్యంగ్య (Satirical) పొలిటికల్ గ్రూప్ సరికొత్త సంచలనం సృష్టించింది.

ఇటీవల సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ డిజిటల్ తిరుగుబాటుకు కారణమయ్యాయి. సమాజంలో ఉద్యోగాలు లేని కొందరు యువకులు ‘బొద్దింకల’ (కాక్‌రోచ్‌లు) లాగా తయారవుతున్నారని, వారు సోషల్ మీడియా యూజర్లుగా, ఆర్టీఐ (RTI) కార్యకర్తలుగా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.

దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలతో ఇప్పటికే విసిగిపోయి ఉన్న యువతకు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. “వ్యవస్థ మనల్ని బొద్దింకలుగా చూస్తే… ఆ బొద్దింకలన్నీ ఏకమైతే ఎలా ఉంటుందో చూపిద్దాం” అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త, 30 ఏళ్ల అభిజీత్ దీప్కే ఈనెల 16న‌ 2026న ఈ వ్యంగ్య ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’కి శ్రీకారం చుట్టారు.
(అయితే, తాను నకిలీ డిగ్రీలతో వ్యవస్థను తప్పుదోవ పట్టించే వారిని ఉద్దేశించి మాత్రమే ఆ మాటలన్నానని, నిరుద్యోగ యువతను కాదని సీజేఐ తర్వాత వివరణ ఇచ్చారు).

4 రోజుల్లోనే 11 మిలియన్ల ఫాలోవర్స్
ఈ డిజిటల్ ఉద్యమం ఊహించని వేగంతో దూసుకెళ్లింది. కేవలం 4 రోజుల్లోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 11 మిలియన్ల (1 కోటి 10 లక్షల) ఫాలోవర్లను దాటేసింది. ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న అధికార బీజేపీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. వేల సంఖ్యలో పోస్టులు పెట్టిన బీజేపీని, కేవలం 56 పోస్టులతోనే కాక్‌రోచ్ జనతా పార్టీ దాటేయడం విశేషం. నెటిజన్లు బీజేపీ నినాదాన్ని వాడుతూ “అబ్ కీ బార్.. 10 మిలియన్ పార్” అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ పార్టీలో చేరాలంటే వింత అర్హతలు
తమను తాము “సోమరులు, నిరుద్యోగుల గొంతుక”గా ప్రకటించుకున్న ఈ పార్టీ, తమ నినాదాన్ని ‘సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ మరియు లేజీ (సోమరి)’ అని పిలుచుకుంటోంది. ఇందులో చేరడానికి వారు పెట్టిన వింత అర్హతలు ఇవే..

  • బలవంతంగా లేదా ఇష్టపూర్వకంగా నిరుద్యోగి అయి ఉండాలి.
  • రోజుకు కనీసం 11 గంటల పాటు ఫోన్ లేదా ఇంటర్నెట్ వాడుతూ ఉండాలి.
  • సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై ప్రొఫెషనల్‌గా గళం విప్పే అలవాటు ఉండాలి.

సీరియస్ మేనిఫెస్టో
కేవలం మీమ్స్‌ కోసమే కాకుండా, దేశంలోని వ్యవస్థాగత లోపాలపై ఈ పార్టీ విడుదల చేసిన 5 సూత్రాల మేనిఫెస్టో యువతను బాగా ఆకట్టుకుంటోంది.

  • రిటైర్మెంట్ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తికీ రాజ్యసభ సీటు వంటి పదవులు ఇవ్వకూడదు.
  • ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యే, ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి.
  • పార్లమెంటు, క్యాబినెట్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
  • ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓట్లు తొలగిస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఉపా (UAPA) చట్టం కింద అరెస్ట్ చేయాలి.
  • NEET పరీక్షా అవకతవకలపై స్పందిస్తూ, CBSE రీచెకింగ్ ఫీజులను పూర్తిగా రద్దు చేయాలి.

ప్రస్తుతానికి ఇది కేవలం ఆన్‌లైన్ మీమ్స్, వ్యంగ్య రూపంలో సాగుతున్న ఒక డిజిటల్ నిరసన అయినప్పటికీ, దేశంలోని నిరుద్యోగ యువతలో ఉన్న అసంతృప్తిని, వారి సోషల్ మీడియా పవర్‌ను ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ స్పష్టంగా చూపిస్తోంది. మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి పలువురు విపక్ష నేతలు కూడా ఈ ట్రెండ్‌పై ఆసక్తి చూపడం విశేషం.

Join WhatsApp

Join Now

Leave a Comment