విశాఖ సీఐఐ సమ్మిట్ (Visakha CII Summit). 40 సంవత్సరాల అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆధ్వర్యంలో విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహించిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారం ముగిసింది. అయితే ఈ సదస్సు అనుకున్న స్థాయిలో పారిశ్రామిక వర్గాల దృష్టిని ఆకర్షించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, అదానీ గ్రూప్ నుంచి కరణ్ అదానీ (Adani Group) మినహా ఏ పెద్ద పారిశ్రామిక దిగ్గజం హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సదస్సుకే రాలేదు. దీనిపై అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. కేంద్ర మంత్రులు కూడా తొలి రోజు తర్వాత హాజరుకాకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
సదస్సుకు అంబానీ (Ambani), జిందాల్ (Jindal) వంటి దిగ్గజాలను ఆహ్వానించినప్పటికీ, వారు పాల్గొనకపోవడం రాష్ట్ర ఆహ్వానాలకు స్పందన ఎలా ఉందనే ప్రశ్నలకు దారితీస్తోంది. ముఖ్యంగా, జత్వానీ కేసుతో జిందాల్ గ్రూప్‌ను వేధించిన ప్రభుత్వ వైఖరిపై ఆందోళనలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండో రోజు సదస్సులో డెలిగేట్స్ తక్కువగా ఉండటంతో, గీతం, ఏయూ, లెండి వంటి విద్యాసంస్థల విద్యార్థులను తరలించి గ్యాలరీలు నింపడం కూడా విమర్శలకు దారితీసింది. విద్యార్థులకే డెలిగేట్ పాస్‌లు ఇచ్చి వేదికను నింపిన చర్యపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతేకాకుండా, అసలు పెట్టుబడిదారుల స్థానంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఎక్కువగా కనిపించడంతో అధికారులు కూడా విచిత్రంగా చూసుకున్నారనే సమాచారం. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులను డెలిగేట్స్‌గా మార్చడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, వైఎస్ జగన్ హయాంలో జరిగిన 2023 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రస్తావిస్తూ, అప్పుడు అంబానీ, అదానీ, జిందాల్, దాల్మియా, జీఎంఆర్ వంటి జాతీయ, అంతర్జాతీయ దిగ్గజాలు పాల్గొన్నారని వైసీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఇక పెట్టుబడుల పరంగా కూడా సంఖ్య పెంచుకునేందుకు గతంలోనే ఒప్పందాలు కుదుర్చుకున్న రెన్యూ, హీరో ఫ్యూచర్స్ ఎనర్జీ, ఏబీసీ కంపెనీలతో మళ్లీ ఎంవోయూలు చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటికే భూకేటాయింపులు, జీవోలు పూర్తయ్యిన సంస్థలతో మరోసారి ఎంవోయూలు చేసి పెట్టుబడుల సంఖ్య పెంచుకున్నట్లు చూపిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. మొత్తం మీద, ఈ సీఐఐ సదస్సు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనప్పటికీ, అనుకున్న స్థాయిలో ప్రతిస్పందన రాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ట్రెండింగ్‌లో కరణ్ అదానీ వ్యాఖ్యలు
సీఐఐ సదస్సు తొలిరోజు సెషన్‌లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ ఎండీ కరన్ అదానీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విశాఖలో డేటా సెంటర్ తామే నిర్మిస్తున్నామని, గూగుల్ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అయితే డేటా సెంటర్ నిర్మాణానికి వైసీపీ హయాంలోనే బీజం పడిందని, వైసీపీ, అదానీ కృషిని కనిపించకుండా, క్రెడిట్ అంతా చంద్రబాబు, లోకేష్‌కు దక్కేలా ఆ ప్రాజెక్టు పేరును గూగుల్‌గా మార్చి ప్రచారం చేసుకున్నారని వాస్తవం బయటపడిందంటున్నారు. చంద్రబాబు సమక్షంలోనే కరణ్ అదానీ వాస్తవాలు వెల్లడించడం గమనార్హం.








