మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా ‘కాకా’పై(Kaaka) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ (Bobby) కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. 2027 సంక్రాంతి (Sankranti) కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి కుమార్తె పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) నటిస్తున్నారు. తాజాగా ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవి.. అనస్వర పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అనస్వర అద్భుతంగా నటించిందని ప్రశంసించిన చిరంజీవి.. “అనస్వర.. నువ్వేమైనా నీ పాత్ర గురించి మాట్లాడతావా? తను మాట్లాడదు.. మాట్లాడలేదు. మాట్లాడటం ఆమెకు నచ్చదు. నేను చెప్పిన ఈ మాటలను ఇంటికి వెళ్లాక గుర్తుచేసుకుని ఆలోచించండి. అప్పుడు అసలు విషయం మీకే అర్థమవుతుంది” అంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో ‘కాకా’లో అనస్వర మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్లు చిరంజీవి పరోక్షంగా హింట్ ఇచ్చినట్లయింది. ఆయన వ్యాఖ్యల అనంతరం అనస్వర ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ కూడా అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఇప్పటివరకు ఆమె పాత్రపై కొనసాగుతున్న ఉత్కంఠకు మరింత బలం చేకూరింది. మెగాస్టార్ తనదైన శైలిలో ఇచ్చిన ఈ ‘చిరు లీక్’ (Chiru Leak) ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.








