అమరావతి కోసం మళ్లీ భూ సేకరణ.. ఈసారి ఎన్ని ఎకరాలంటే..

అమరావతి కోసం మళ్లీ భూ సేకరణ.. ఈసారి ఎన్ని ఎకరాలంటే..

అమరావతి నిర్మాణ పనులు మళ్లీ వేగం అందుకుంటుండడంతో, ప్రభుత్వం రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే అమరావతి మొదటి దశలో రైతుల నుంచి సుమారు 50 వేల ఎకరాల భూమిని సేకరించింది. అదనంగా 16 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సీఆర్డీఏ (CRDA) ఆధీనంలోకి అప్పగించింది. ఈ రెండింటిని కలిపి మొత్తం 70 వేల ఎకరాల రాజధాని నిర్మాణ ప్రాంతం సిద్ధమైంది. ఇప్పుడు మరింత విస్తృతంగా నగర నిర్మాణం కొనసాగేందుకు రెండో విడత భూ సేకరణకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

రెండో విడత లక్ష్యం మరో 20 వేల ఎకరాల భూమి సమీకరణ. ఈ క్రమంలో CRDA ఇప్పటికే గ్రామాల వారీగా ప్రాథమిక ప్రణాళికలు సిద్ధం చేసింది. ల్యాండ్‌ పూలింగ్ నోటిఫికేషన్ విడుదలకు ముందు జరుగుతున్న ఫీల్డ్‌ వర్క్‌లో రైతుల నుంచి భూముల సమీకరణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడానికి ఈ భూ సేకరణ చేపడుతున్నట్లుగా సమాచారం.

ఈ విడతలో భూ సేకరణ ముఖ్యంగా ఏడు గ్రామాల్లో జరగనుంది. వాటిలో వైకుంఠపురం – 3,361 ఎకరాలు, పెదమద్దూరు – 1,145 ఎకరాలు, ఎండ్రాయి – 2,166 ఎకరాలు, కర్లపూడి – 2,944 ఎకరాలు, వడ్డమాను – 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురం – 2,418 ఎకరాలు, పెదపరిమి – 6,513 ఎకరాలు ఉన్నాయి. ఇవి రైతుల భూములతో పాటు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు కూడా భాగమవుతాయి. మొత్తం 20,494 ఎకరాల భూమిని సేకరించే దిశగా CRDA ముందడుగు వేస్తోంది.

త్వరలోనే రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. నిర్మాణ పనులకు అవసరమైన భూములు సిద్ధం కావటం ద్వారా అమరావతి మౌలిక సదుపాయాలు, రోడ్లు, కార్యాలయ భవనాలు, పబ్లిక్ సర్వీసులు వంటి కీలక రంగాల్లో అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment