వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్న మిర్చి రైతులను బుధవారం పరామర్శించారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన జగన్‌తో పాటు మరో ఎనిమిది మంది వైసీపీ నేతలను నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, జగన్ పర్యటనతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
మిర్చి ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవస్థలు పడుతున్న మిర్చి రైతులకు మద్దతుగా నిలిచేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించి రైతులను పరామర్శించి, వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటన సందర్భంగా పోలీసులు కనీస భద్రత కూడా కల్పించలేదు. మిర్చి యార్డులో ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా కనిపించలేదు.